APPSC GROUP 2 MAINS EXAM: ఈనెల 23వ తేదీ (ఆదివారం) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పరీక్షల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఎ.అనురాధతో కలసి ఆయన అధికారులతో సమీక్షించారు. పరీక్షల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు 92,250 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు.
తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు: ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాల్లో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2: 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్-1 పరీక్ష ఉంటుంది, అభ్యర్ధులు ఉదయం 9.30 గంటల లోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయాలి, ఆలస్యంగా వచ్చిన ఎవరినీ లోనికి అనుమతించరు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకూ పేపర్-2 పరీక్ష ఉంటుంది, అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలలోగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి ఆ తర్వాత అభ్యర్థులెవరినీ లోనికి అనుమతించరు.
ఎలక్ట్రానిక్ వాచీలు అనుమతించరు: గ్రూప్-2 మెయిన్ పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో పరీక్షలు వాయిదా పడతాయని, ఇతర దుష్ప్రచారం జరుగుతోందని, అటువంటివేమీ అభ్యర్ధులు నమ్మవద్దని ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ స్పష్టం చేశారు. అలాగే పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్సు, నెట్ కేంద్రాలన్నీ మూసి ఉంచాలన్నారు. పరీక్ష హాలులోకి మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వాచీలు తదితర పరికరాలను ఎట్టిపరిస్థితుల్లోను అనుతించరాదని తెలిపారు.