AP SSC Toppers Inspiring Stories: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఇందులో పలువురు విద్యార్థుల జీవితాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇంటి పరిస్థితి బాగాలేకున్నా అత్యధిక మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు.
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600:100, 99, 100, 100, 100, 100 ఇవేంటని అనుకుంటున్నారు? ఇవి పదో తరగతిలో ఓ విద్యార్థినికి వచ్చిన మార్కులు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి (Venkata Naga Sai Manasvi) ఈ మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద మార్కులు సాధించింది. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మనస్వీ చదివింది. తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్ సైతం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనస్వీ పేర్కొంది.
బాల్యవివాహం నుంచి బయటపడి కల దిశగా ప్రయాణం - ఇంటర్ ఫలితాల్లో టాప్ మార్కులు - Inter First Year Top Scorer Nirmala
పేదింట విరిసిన విద్యాకుసుమం:విజయవాడలోని గోవింద రాజుల ఈనాం ట్రస్ట్(GDET) మున్సిపల్ పాఠశాల పదో తరగతి విద్యార్థిని గాడెల్లి సువర్షిత 594 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. తండ్రి నాగరెడ్డిబాబు ఆటో డ్రైవర్ కాగా, తల్లి బేబి సరోజని గృహిణి. వారికి ముగ్గురు కుమార్తెలు. పటమటకు చెందిన నాగిరెడ్డి తన ముగ్గురు కుమార్తెలను మగ పిల్లలకంటే ధీటుగా పెంచారు. ఆటో నడుపుకుంటూ వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో పెద్ద కుమార్తె సువర్షిత 594 మార్కులు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని సువర్షిత తెలిపింది.
3 రోజులు కూలికి, 3 రోజులు బడికి - 509 మార్కులు:కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి కాగా, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఆంజనేయులు వ్యవసాయ కూలీ, తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇంటి పరిస్థితి గమనించిన నవీన వారంలో మూడు రోజుల పాటు కూలి పనులకు వెళ్తూ, మూడు రోజులే స్కూల్‌కి వెళ్తోంది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలిక శ్రద్ధను చూసి ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు. ఫీజులు, పుస్తకాలు అందిస్తూ చేయూతనిచ్చారు. దీంతో పదో తరగతిలో ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కంటే అత్యధిక మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది.
విఫలమైనా పట్టుబట్టారు - సివిల్స్ సాధించారు - AP Candidates in UPSC civils