AP Secretariat Neglected for 5 Years: అమరావతి రాజధానిపై కక్షగట్టిన గత ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది. సచివాలయానికి గత సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడు మాత్రమే రావటంతో మంత్రులు, అధికారులు సైతం దాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతోపాటు నిర్వహణా లోపంతో రాష్ట్ర సచివాలయం తల్లడిల్లుతోంది. ఐదు బ్లాకులుగా ఉన్న సచివాలయంలోని కార్యాలయ కారిడార్లలో టైల్స్ పగిలిపోయి, మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఛాయలు రాష్ట్ర సచివాలయంపైనా పడ్డాయి. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రే సచివాలయానికి రాకపోవటంతో అధికారులూ నిర్లక్ష్యం చేశారు. ఫలితం రాష్ట్రానికి పాలన అందించే రాష్ట్ర సచివాలయం నిర్మానుష్యమైంది. దీంతో ఎక్కడికక్కడ పెచ్చులూడాయి.
పోలవరం ఐదేళ్లు వెనక్కి!- జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు కొత్త సమస్యలు - Polavaram Future Was Reversed
కొన్నిచోట్ల ఫ్లోరింగ్ కోసం వేసిన టైల్స్ ముక్కలయ్యాయి. సచివాలయం చుట్టూ చెత్తా చెదారం పేరుకుంది. నిర్వహణ సరిగ్గా లేక డ్రెయిన్లూ అస్తవ్యస్తంగా మారాయి. కొందరు ఉన్నతాధికారుల కార్యాలయాల్లో ఏసీలు కూడా పనిచేయని దుస్థితి నెలకొంది. అయినా గడచిన ఐదేళ్లుగా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
అమరావతిపై గత సర్కారు ఎంత కక్ష గట్టిందనటానికి ఈ స్మార్ట్ సైకిళ్లే సాక్ష్యం. ఉద్యోగులు, అధికారులు, సందర్శకుల కోసం కొనుగోలు చేసిన వీటిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూలనపడేసింది. ఒక్కోక్కటీ 1.20 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన సైకిళ్లను వినియోగించకుండా పక్కనపడేశారు.
గత ఐదేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పు పట్టిపోయాయి. జీపీఎస్ లాంటి అధునాతన ఫీచర్లు కలిగిన ఈ సైకిళ్లు వ్యాయామం కోసం కూడా గతంలో ఉద్యోగులు వినియోగించే వారు. ఇప్పుడవి తుక్కుగా వేసేందుకు కూడా పనికిరాకుండా పోయాయి. సచివాలయంలో కాలినడకల కోసం వేసిన బాటలు, వివిధ బ్లాక్‌లలో కారిడార్‌లు, మరుగుదొడ్లు ఇలా అన్నీ నిర్వహణ లేక ధ్వంసమయ్యాయి.
ఐదేళ్లలో ఇల్లుపీకి పందిరేశారు- అమరావతి నిర్మాణం చంద్రబాబుకు సవాలే! - Amaravati city Construction
సెక్రటేరియట్ దుస్థితిపై లోకేశ్: కొద్ది రోజుల క్రితం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్ సైతం సచివాలయం నిర్వహణపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఛాంబర్‌తో పాటు సచివాలయంలో పలు గదులు నిర్వహణ సరిగా లేకపోవడంపై లోకేశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సచివాలయానికి వచ్చే వారా అని లోకేశ్ అధికారులను అడిగారు. మంత్రులు అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు చెప్పారు. జగనే సచివాలయానికి రానప్పుడు మంత్రులు ఎలా వస్తారులే అని లోకేశ్ వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్ నిర్వహణకు కేటాయించిన నిధులు కూడా లేవని ఉద్యోగులు ఆ సందర్భంగా తెలిపారు. సచావాలయంలోని సమస్యలు అన్నిటినీ పునరుద్ధరించాల్సిందిగా కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుతున్నారు.
యథా సీఎం తథా మంత్రులు- జగన్ పాలనలో సెక్రటేరియట్ దుస్థితిపై లోకేశ్ విసుర్లు - Lokesh on Secretariat Maintenance