AP Pensioners Association Round Table Meeting:ఏపీ పునర్నిర్మాణం కోసం ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఆర్థికపరంగా అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు అన్నారు. ఇంత అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వం మళ్లీ మనకు కావాలా అని ప్రశ్నించారు. హైదారాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సమస్యలు - పరిష్కార మార్గాలు అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ అధ్యక్షుడు కె. నళినీ మోహన్‌కుమార్ అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమానికి అఖిల భారత రాష్ట్ర పెన్షనర్స్ సమాఖ్య మాజీ కార్యదర్శి జి. పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శి డి. సుధాకర్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయిస్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు హాజరయ్యారు.
2019లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెన్షనర్లంతా సంక్షోభం ఎదుర్కొంటున్నామని బుచ్చిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. 2014- 2019 మధ్య కాలంలో పెన్షన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చిందని అన్నారు. అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక లోటు లెక్క చేయకుండా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్లో 10వ పీఆర్‌సీ ఇచ్చిందని తెలిపారు. 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు 10 నెలల పీఆర్సీ, ఆరియర్స్ సుమారు 2 వేల కోట్ల రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఒకేసారి పెన్షనర్లందరికీ చెల్లించిందని బుచ్చిరాజు గుర్తు చేశారు.