AP Ministers Inspected Flooded Areas of Godavari:ఎర్ర కాలువ ముంపుతో తూర్పుగోదావరి జిల్లాలో నష్టపోయిన పంట పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత , కందుల దుర్గేష్ పరిశీలనలో పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం, పసలపూడి, కాల్ధరి, నిడదవోలు మండలం తాళ్లపాలెం కంసాలిపాలెం గ్రామాల్లో వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు.
రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పంట నష్టం వివరాలను మంత్రులకు వివరించారు. బాధితులకు మంత్రులు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, విశాలాక్షి దంపతులు మంత్రులను సత్కరించారు. ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
కోనసీమలో పర్యటన: కోనసీమ జిల్లాలోనూ మంత్రుల బృందం పర్యటించింది. కే గంగవరం మండలం కోటిపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రుల బృందం, జిల్లా అధికారులు పర్యటించారు. ఈ క్రమంలో బాధిత ప్రజలకు నిత్యవసర సరుకులను అందించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలోని కోతకు గురైన గోదావరి ఏటి గట్టు పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తెలుసుకుని తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. ఐదేళ్ల జగన్ పాలనలో గోదావరి ఏటిగట్టును ఏమాత్రం పట్టించుకోలేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇప్పుడు కోతకు గురవుతున్న ఏటిగట్టులకు శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు.