AP HC on Jagan Security : తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంత మంది భద్రత సిబ్బందిని ఇచ్చారో దానిని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో ఎస్‌ఆర్‌సీ సభ్యులు, ఐపీఎస్ అధికారి ఎస్‌ఎన్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేశారు. ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం జడ్‌ప్లస్ కేటగిరి వ్యక్తికి 58 మంది భద్రత సిబ్బందిని ఇస్తారని కౌంటర్‌లో తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2023లో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం జడ్‌ప్లస్ భద్రత సిబ్బందికి అదనంగా సిబ్బందిని కల్పించారని తెలిపారు.
ఈ ఏడాది ఎన్నికల్లో జగన్ పరాజయం పాలవడంతో సీఎం పదవి కోల్పోయారని, ఈ నేపథ్యంలో అదనపు భద్రత సిబ్బందిని పొందే విషయంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులకు 2023లో తెచ్చిన చట్టం వర్తించదని కోర్టుకు వివరించారు. అదనపు భద్రత సిబ్బందిని పొందడానికి వారు అనర్హులని స్పష్టం చేశారు. ఈ విషయాలను దాచిపెట్టి హైకోర్టులో వ్యాజ్యం వేశారని, సీఎం నుంచి ఎమ్మెల్యే స్థాయికి మారినప్పటికీ జగన్‌కు ఈ ఏడాది జులై 20 వరకు గతంలో ఇచ్చిన భద్రతనే కొనసాగించామని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ జులై 16న సమావేశం నిర్వహించిందని, కొత్తగా ఎంపికైన ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫారసు చేసిందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపాలైన నాయకులకు గతంలో కల్పించిన పొజిషన్ ఆధారిత భద్రతను ఉపసంహరించాలని తీర్మానించిందని జగన్ విషయంలో మాత్రం జడ్‌ప్లస్ కేటగిరిని కొనసాగించాలని నిర్ణయించిందని కౌంటర్ స్పష్టం చేశారు.