Anticipatory Bail to MLA Pinnelli Ramakrishna Reddy :తెలుగుదేశం ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం, ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశావని ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను తీవ్రంగా దుర్భాషలాడటంతో పాటు సీఐ నారాయణస్వామిపై దాడి ఘటనల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని బాధితులు, పోలీసులు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వద్దని బాధితుల తరఫు న్యాయవాదులు వాదించగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని, ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిన్నెల్లి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం అరెస్టు నుంచి జూన్ 6 వరకు పిన్నెల్లికి రక్షణ కల్పిస్తూ అరెస్టుతోపాటు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
పిన్నెల్లిపై పూర్తిస్థాయిలో నిఘా : ఈ సందర్భంగా న్యాయమూర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొన్ని షరతులు విధించారు. ఎమ్మెల్యే పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోపు హాజరు కావాలని స్పష్టం చేసింది. నరసరావుపేట దాటి వెళ్లొద్దని, ఆ ఊళ్లో ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి తెలియజేయాలని ఆదేశించింది. పిన్నెల్లి కదలికలపై పోలీసు అధికారులతో పూర్తిస్థాయిలో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఏ విధమైన నేరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దని తేల్చిచెప్పింది. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది.
పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు - జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు - No Action Against MLA Pinnelli
పిన్నెల్లి రోజూ హాజరు కావాల్సిందే- షరతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : హైకోర్టు (ETV Bharat) గురజాల మేజిస్ట్రేట్ కోర్టులో పాస్‌పోర్టు :అనుచరులను నియంత్రించే బాధ్యత, ఆ ప్రాంతంలో ప్రశాంతతకు, బాధితులకు ఏ విధమైన అవరోధాలు కలిగించే ప్రయత్నాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదేనని తెల్చిచెప్పింది. కేసులకు సంబంధించి తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడవద్దని స్పష్టం చేసింది. బాధితులను, సాక్షులను కలవడానికి వీల్లేదంది. వారిని ప్రభావితం, భయపెట్టడం చేయవద్దని ఆదేశించింది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలో మాత్రమే ఉండాలని పిన్నెల్లికి తేల్చిచెప్పింది. ఓట్ల లెక్కింపు కేంద్రం మరోచోట ఉన్నట్లయితే లెక్కింపు రోజు మాత్రమే అక్కడికి వెళ్లవచ్చంది. గురజాల మేజిస్ట్రేట్ కోర్టులో పాస్‌పోర్టును అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లొద్దంది. బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి రక్షణగా గస్తీ ఏర్పాటు చేయాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది. న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది.
ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి - PINNELLI CASE
ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలి : తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లకు పైబడి శిక్షపడేందుకు వీలున్న ఐపీసీ సెక్షన్ 307 కేసుల్లో ఎన్నికల్లో పాల్గొన్న పలువురు అభ్యర్థులకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇదే న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేశారు. అదే సూత్రం పిటిషనర్‌కు వర్తిస్తుందన్నారు. ఎన్నికల బరిలో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. న్యాయచక్రాలు నెమ్మదిగా తిరుగుతుండొచ్చు కానీ సక్రమంగా తిరుగుతాయని సుప్రీంకోర్టు ఓ కేసులో ఉటంకించిన విషయాన్ని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ కేసులో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను జూన్ 6కి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ ఎస్పీ ముందు హాజరుకావాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఓట్ల లెక్కింపు రోజున ఆర్వో ముందు హాజరయ్యేలా సవరించాలని కోరగా ఆ ఒక్కరోజుకు కోర్టు వెసులుబాటు ఇచ్చింది.
'సిగ్గులేదారా? టీడీపీ ఏజెంట్లను బయటకు పంపండి'- 'ఏఎస్ఐకి వార్నింగ్'- పిన్నెల్లి పర్వంలో దాగిన అరాచకాలెన్నో! - Palnadu YSRCP Leaders Anarchy