ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనార్టీ గురుకులాలపై మొద్దునిద్ర - అయిదేళ్లలో ఒక్కటీ ఏర్పాటు చేయని వైసీపీ సర్కార్ - Govt Negligence on Gurukul Schools

AP Govt Negligence on Minority Gurukul Schools: సభల్లో, వేదికలపై సీఎం జగన్‌ పదే పదే " నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలంటూ గొప్పలు పోవడమే కానీ ఆయా వర్గాల కోసం ఆయన గొప్పగా చేసిందేమీ లేదు. ముఖ్యంగా మైనార్టీలకు వైసీపీ పాలనలో తీరని అన్యాయం జరిగింది. వారి పిల్లల చదువులను గాలికొదిలేశారు. పక్క రాష్ట్రం తెలంగాణతో పోల్చి చూస్తే మైనార్జీలకు జగన్‌ చేసిన అన్యాయం ఏంటో పక్కాగా లెక్కలతో సహా స్పష్టమవుతోంది. నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది! తెలంగాణలో గురుకులాల సంఖ్యను 17 రెట్లు పెంచితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మైనారీటీల గురుకుల విద్యకు జగన్‌ గ్రహణం పట్టించారు.

AP_Govt_Negligence_on_Minority_Gurukul_Schools
AP_Govt_Negligence_on_Minority_Gurukul_Schools

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 9:22 AM IST

మైనార్టీ గురుకులాలపై మొద్దునిద్ర - అయిదేళ్లలో ఒక్కటీ ఏర్పాటు చేయని వైసీపీ సర్కార్

AP Govt Negligence on Minority Gurukul Schools: గురుకులాల పేరు వినగానే ఎవరికైనా చక్కని బోధన, సకల సౌకర్యాలు, మంచి ఆహారం, నిపుణులైన ఉపాధ్యాయులకు నెలవైన ప్రాంతం గుర్తుకువస్తుంది. వాటిలో సీటు సాధిస్తే చాలు పిల్లల భవితపై చింతే ఉండదని తల్లిదండ్రులు భావిస్తారు. అందుకే తమ పిల్లలు గురుకులాల్లో చదువుకోవాలన్నది నిరుపేదల కల.

బడుగు, బలహీన, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని గురుకులాల సంఖ్యను పెంచడం, అందులో సౌకర్యాలను మెరుగుపరచడం ప్రభుత్వాల బాధ్యత. వైసీపీ ప్రభుత్వం ఆ బాధ్యతను పక్కన పెట్టేసింది. జగన్‌ తన పాలనలో గురుకుల వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. ముఖ్యంగా మైనార్టీ గురుకులాల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ ఏమాత్రం శ్రద్ధ చూపలేదు.

ఉన్నత విద్యను ఉరి తీస్తున్న జగన్​ సర్కార్​

ఒక గురుకులాన్ని ఏర్పాటుచేస్తే వందల మంది పేద విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్య అందించినట్లే. ఎన్నో పేద కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్లు లెక్క. తెలంగాణ ప్రభుత్వం అచ్చంగా ఈ మూలసూత్రాన్నే పాటించింది. మైనార్టీ విద్యార్థులకు సకల వసతులు కల్పించి, వారికి అపారమైన విద్యావకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంతగా అంటే తెలంగాణ ఆవిర్భావం నాటికి మైనార్టీ గురుకుల సంఖ్య 12 ఉండగా దానిని ఏకంగా 204కు పెంచింది.

అంటే పది సంవత్సరాల కాలంలో అదనంగా 192 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది. మరి మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటే ముక్కుమీద వేసుకోవాల్సిందే. మైనార్టీలంటే అపారమైన గౌరవం అంటూ సభలు, సమావేశాల్లో ప్రేమ ఒలకబోసే ముఖ్యమంత్రి జగన్‌ తన ఐదేళ్ల పాలనలో చేసిదేంటో తెలుసా? వారికి గురుకుల విద్యను వేల మైళ్ల దూరంలో ఉంచడమే. ఒక్కటంటే ఒక్క కొత్త గురుకులాన్ని ఏర్పాటు చేయకుండా జగన్‌ సర్కార్‌ మొద్దునిద్ర పోయింది.

విద్యార్థుల నిధులపై కన్నేసిన జగన్ సర్కార్​ - విద్యా కార్యక్రమాల ప్రచార పేరుతో 4 కోట్లు

తెలంగాణలో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేసి మరీ గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఏపీలో మాత్రం ప్రత్యేక సొసైటీ ఏర్పాటు ఊసే కరవైంది. ఇక్కడి 9 మైనార్టీ గురుకులాలను విద్యాశాఖ పరిధిలోని ఏపీ గురుకులాల విద్యాలయాల సంస్థనే పర్యవేక్షిస్తోంది. తెలంగాణలోని గురుకులాల్లో ప్రవేశాలకు ముస్లిం విద్యార్థుల నుంచి భారీ డిమాండ్‌ ఉంది. దీంతో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇక్కడ మాత్రం జగన్‌ అనుసరిస్తున్న అనాలోచిత విధానాలతో గురుకులాల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కావడం లేదు.

తెలంగాణలో మైనార్టీ గురుకులాలు దేశానికే దిక్సూచిగా మారగా, జగన్‌ ప్రభుత్వ తీరుతో మైనార్టీ గురుకులాలు ఎలా ఉండకూడదో తెలియజేసే సూచికగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోంది. తెలంగాణలోని మొత్తం 204 మైనార్టీ గురుకులాల్లో అందులో బాలికల గురుకులాల సంఖ్య 97. దీన్ని బట్టి ముస్లిం బాలికల విద్యకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం ఇట్టే తెలిసిపోతోంది. అంతేకాకుండా మైనార్టీ బాలికల చదువు నిలిచిపోవద్దన్న ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటు చేసిన 192 గురుకులాలను రెండు సంవత్సరాల క్రితం అక్కడి ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. డిగ్రీ విద్యను ప్రోత్సహించింది.

2014లో రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో 8 వేల మంది మైనార్టీలకు గురుకుల విద్య అందుతుండేది. ఇప్పుడు ఏటా 1.30 లక్షల మంది మైనార్టీ పిల్లలకు ఉచితంగా విద్య అందుతోంది. మొత్తానికి తెలంగాణలో పదేళ్లలో 10.89 లక్షల మంది మైనారిటీలకు నాణ్యమైన విద్యను అందించారు. ఆంధ్రప్రదేశ్​లో మాత్రం గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు ఒక మాదిరిగా ఉండగా పాఠశాలల్లో అయితే మరి దారుణం. ఇక్కడ ఏటా ఒక్కో గురుకుల పాఠశాలలో 480 మందికి ప్రవేశాలు కల్పించాల్సి ఉండగా సగం కూడా భర్తీ కావడం లేదు. పోస్టులను భర్తీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులు, ఒప్పంద ప్రాతిపదికన నియమించిన ఉపాధ్యాయులతోనే బోధనను నెట్టుకొస్తున్నారు.

76 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమైన జగన్ సర్కార్‌

విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం మైనార్టీలకు సంబంధించి ఐటీఐ, పాలిటెక్నిక్‌లతోపాటు గురుకులాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కర్నూలు జిల్లా ఆదోని, అనంతపురం జిల్లా అనంతపురం, కదిరి, గుంతకల్లు, గుôటూరు జిల్లా తురకపాలెం, కడప జిల్లాలోని కడపలో మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే కదిరి, గుంతకల్లులోని భవనాల నిర్మాణం దాదాపు పూర్తయింది.

మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. జగన్‌ పాలన అంటేనే రివర్స్‌ కదా. అందుకే నిర్మాణంలో ఉన్న గురుకులాలను చాపచుట్టి అటకెక్కించారు. కొత్తవాటి ఏర్పాటును మరిచిపోయారు. వీటి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. అయితే రాష్ట్ర వాటాగా తాము నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వాటి ఏర్పాటును పట్టించుకోకుండా మైనార్టీలకు జగన్‌ సర్కారు వెన్నుపోటు పొడిచింది.

ఆంధ్రప్రదేశ్​లో దాదాపు 40 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు. 30 వేల నుంచి 80 వేల వరకు ముస్లిం ఓట్లు ఉన్న నియోజకవర్గాలు రాష్ట్రంలో 30 వరకు ఉన్నాయి. ఈ 30 నియోజకవర్గాల్లోనూ ఒక్కో గురుకులం ఏర్పాటు చేయవచ్చని అధికార వర్గాలే చెబుతున్నాయి. కనీసం వాటిలోనైనా ఒక్క మైనార్టీ గురుకులాన్ని ఏర్పాటు చేయలేదంటే మైనార్టీలపై జగన్‌ది ఎంతటి కపట ప్రేమో అర్థం చేసుకోవచ్చు.

ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేసిన జగన్

ABOUT THE AUTHOR

...view details