AP Govt and APPSC Appeal in HC on 2018 Group1 Issue: ఏపీపీఎస్సీపై తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించాయి. 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో తప్పులు - ‘అతివాద దశ’ బదులుగా తీవ్రవాద దశ!
కాగా 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి వైసీపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ న్యాయబద్ధంగా లేవని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దుచేసింది.
6 నెలల్లో మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని పేర్కొంది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల టైమ్ ఇవ్వాలని పేర్కొంది. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్ తీసుకున్నఅభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో హక్కులను కోరబోమని, న్యాయస్థానం ఆదేశాలతో ఏపీపీఎస్సీకి అఫిడవిట్ ఇచ్చారని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.