FEE REIMBURSEMENT SCHEME :రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించనుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలకు భరోసా కల్పించేలా ముందస్తుగా కొంత మొత్తం విడుదల చేయాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఫీజు చెల్లింపుల నేపథ్యంలో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు బకాయి పెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు తాజాగా మంత్రి మండలి సమావేశంలోనూ చర్చించగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ సూచనతో ప్రభుత్వం స్పందించింది. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని, వారికి భరోసా కల్పించేలా ముందుగా కొన్ని నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
చిక్కీ డబ్బులు కూడా చెల్లించని జగన్.. ఇప్పుడు సుద్దపూసలా కబుర్లు చెబుతున్నాడు: మంత్రి లోకేశ్
ఇదిలా ఉండగా తమ హయాంలో పెండింగ్ బిల్లులపై వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు పూనుకోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ఆ పార్టీ పిలుపునివ్వడంతో విమర్శలు వచ్చాయి. క్యాబినెట్ సమావేశంలో మంత్రి లోకేశ్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వేలాదిమంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నిధుల విడుదలకు ఆమోదం తెలపాలని కోరగా సీఎం వెంటనే స్పందిస్తూ ప్రాధాన్యతా క్రమంలో విడుదల చేయాలని సూచించారు. అయితే అవి గత ప్రభుత్వం తెచ్చిన తల్లుల ఖాతాల్లోకి, జాయింట్ ఖాతాల్లోకి కాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన విధంగా విద్యార్థుల (యాజమాన్య) ఖాతాల్లోకి నమోదు చేయాలని స్పష్టం చేశారు.
సర్టిఫికెట్ల జారీలో తొలగనున్న ఇబ్బందులు