AP Govt Survey on Work from Home Policy:రాష్ట్రంలో 'వర్క్ ఫ్రం హోం' విధానాన్ని విస్తృతపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇంటింటికెళ్లి మీరు 'వర్క్ ఫ్రం హోం' చేస్తున్నారా? మీకున్న సమస్యలేంటి? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉండి, ఆధునిక సాంకేతికాంశాలపై అవగాహన, విద్యార్హత కలిగిన వారికి 'వర్క్ ఫ్రం హోం' ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంగళవారం నుంచి సర్వే చేపట్టింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సచివాలయాల సిబ్బంది వెళ్లి వారి వివరాలు సేకరించనున్నారు. వచ్చే నెల 10 నాటికి ఈ సర్వే పూర్తి చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేయనుంది. వివిధ సంస్థల ద్వారా ప్రస్తుతం ఇళ్ల నుంచి పని చేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, దాని స్పీడ్, విధి నిర్వహణకు గదుల కొరత తదితరాలను ఈ సర్వేలో గుర్తించనున్నారు. ఇంక తగిన విద్యార్హత కలిగిన వారు ఐటీ/ఐటీఈఎస్/ఇతర అనుబంధ సంస్థల్లో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారా అనేది తెలుసుకోనున్నారు.