CM Chandrababu on Pensions :కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇవ్వనున్నారు. రెండు నెలలు తీసుకోలేకపోతే ఆ తర్వాత నెలలో మూడు నెలల మొత్తం అందించనున్నారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్ నుంచే అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
2014-2019 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు, పిల్లల వద్ద ఉంటున్న పింఛన్ల లబ్ధిదారుల ఇబ్బందుల్ని అప్పటి ప్రభుత్వం గమనించింది. రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛను ఇచ్చేలా నూతన విధానం తెచ్చింది. దీంతో వారి ఇబ్బందులు తప్పాయి. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జగన్ దీన్ని రద్దుచేసి ఏ నెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలనే నిబంధన తెచ్చి లబ్ధిదారుల్ని ఇక్కట్లపాలు చేశారు.
ఒక నెల పింఛను తీసుకోకపోతే ఆ నెల మొత్తం కోత వేసేవారు. మరుసటి నెల ఆ పింఛను ఇవ్వలేదు. రెండు నెలలు తీసుకోలేకపోతే ఆ మొత్తాన్నీ ఇవ్వకుండా మూడోనెల పింఛను మాత్రమే ఇచ్చేవారు. పోర్టబులిటీ సౌకర్యాన్ని తీసేశారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మళ్లీ పాత విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. దీపావళి సందర్భంగా దీపం-2 పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ మేరకు స్పష్టం చేశారు.