Chandrababu Comments on Balakrishna and Bhuvaneswari: సినీనటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యకు అభినందనలు తెలుపుతూ ఆయన సోదరి, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరైన బాలకృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఇద్దరి మధ్య నలిగిపోతున్నా:ఒక పక్కన బాలయ్య, మరోపక్కన అంతే పవర్‌ఫుల్ భువనేశ్వరి ఉన్నారని, ఇద్దరి మధ్య ఇప్పుడు నేను నలిగిపోతున్నా అంటూ నవ్వులుపూయించారు. వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదమని, నిన్నటి వరకూ అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య అయ్యారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ బిడ్డ, తమ కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఇదే తొలిసారి అని సీఎం చంద్రబాబు అన్నారు.
బాలయ్య నాకంటే నాలుగేళ్లు సీనియర్:కుటుంబ సభ్యులందరం ఎంతో గర్వపడుతున్నామని, ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇదొక అన్‌స్టాపబుల్ జర్నీ అని, ప్రతి ఒక్కరూ జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకోవాలనుకుంటారని అన్నారు. చాలా మంది ఒకే రంగంలో రాణిస్తుంటారని, కానీ బాలయ్య మాత్రం వివిధ రంగాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. 1974లో తొలిసారి బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చారని, 1978లో తాను తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. తన నాకంటే బాలయ్య నాలుగేళ్లు సీనియర్ అని చంద్రబాబు చెప్పారు.