AP CABINET MEETING DECISIONS: అసాంఘిక, సంఘ విద్రోహ శక్తుల పీచమణిచేలా ముందస్తు నిర్బంధ చట్టం (పీడీ యాక్ట్)లో కీలకమైన మార్పులు చేస్తూ రూపొందించిన చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం పేరు, నిర్వచనం మార్చుతూ ప్రభుత్వం కొత్తగా 10కి పైగా నేరాల్ని దీని పరిధిలోకి తీసుకురానుంది. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులతో చెలరేగిపోతున్నవారిని సైతం పీడీ చట్టం పరిధిలోకి తీసుకురానుంది. భూకబ్జాదారులు, రేషన్ బియ్యం అక్రమ నిల్వతో పాటు రవాణా, విక్రయం, ఎగుమతులు వంటి నేరాలకు పాల్పడేవారిపైనా పీడీ చట్టం ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఎలక్షన్స్‌లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission) వంటి న్యాయ సంబంధిత సంస్థల్ని అక్కడే కొనసాగించాలనే ప్రతిపాదనకు సైతం క్యాబినెట్లో ఆమోదించారు. కర్నూలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (Andhra Pradesh Electricity Regulatory Commission) కార్యాలయాన్ని రాజధాని అమరావతికి తరలించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవీ.
హనీమూన్ ముగిసింది - ఇక మంత్రులు పట్టు సాధించాలి: చంద్రబాబు
పర్యాటకానికి పారిశ్రామిక హోదా:పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ప్రతిపాదనను ఆమోదించింది. గతంలో లేని విధంగా పర్యాటక ప్రాజెక్టులకు సైతం పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల్ని వీటికీ వర్తింపజేయాలని నిర్ణయించింది. మైక్రో ప్రాజెక్టులకు 1.50 కోట్ల రూపాయల వరకు, మధ్యతరహా వాటికి 7.5 కోట్ల రూపాయలు (ఇందులో మహిళలకు అదనపు ప్రోత్సాహం) మెగా ప్రాజెక్టులకు 25 కోట్ల రూపాయలు, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు 40 కోట్ల రూపాయల వరకు గరిష్ఠంగా రాయితీలు ఇస్తారు.
పర్యాటక విధానంపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పర్యాటకుల భద్రత, రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కేరళలో స్థానిక నృత్యాలు, యుద్ధ కళలు, సంస్కృతుల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నారని, ఏపీలోనూ థింసా వంటి ప్రత్యేక నృత్యాలు, కళలు, సంస్కృతులు ఉన్నాయని, వాటిని ప్రోత్సహించాలని సూచించారు. ‘టెక్స్‌టైల్ టూరిజం’ వంటి ప్రత్యేక కాన్సెప్ట్‌లను ప్రోత్సహించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి.
అవిశ్వాస తీర్మానాలపై గడువు రెండేళ్లకి కుదింపు - క్యాబినెట్ సంచలన నిర్ణయాలు