Anakapalle Couple Invited to Republic Day Celebrations :రాష్ట్రంలో వివిధ అంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురికి దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గృహిణికి దిల్లీలో ఈనెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. పాయకరావుపేటకు చెందిన భీమిశెట్టి నాగేశ్వరరావు, లావణ్య రమాకుమారి దంపతులు ఉమ్మలాడలో స్థిరపడ్డారు. విద్యుత్తు ఆదాకు కేంద్రప్రభుత్వం సూర్యఘర్ పథకాన్ని అమలు చేసింది. రాయితీపై ఇంటిపైనే సోలార్ పరికరాలు ఏర్పాటు చేస్తోంది. ఇంటి అవసరాలకు సరిపడా విద్యుత్తును వినియోగించుకుని మిగులు విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఈ పథకం అమలు చేస్తోంది.
ఈ పథకం కింద లావణ్య రమాకుమారి ఏడాది క్రితం 5కేవీ విద్యుత్తు ఉత్పత్తి అయ్యే సోలార్ పలకలు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఇంటి అవసరాలకు వినియోగించే విద్యుత్తు బిల్లు నెలకు రూ.మూడు వేలు పైగా వచ్చేదని లావణ్యా రమాకుమారి తెలిపారు. సోలార్ విద్యుత్తు ఏర్పాటుచేసిననాటి నుంచి జీరో బిల్లు వస్తోందన్నారు.
ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిన సందతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ ఇస్తోంది.