Amul Stopped Milk Collection in AP :చంద్రబాబు సహా తెలుగుదేశం నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ అమూల్‌ను ఏపీకి తీసుకొచ్చారు. వీరవిధేయులైన కొందరు అధికారులు నిబంధనలను కూడా పట్టించుకోకుండా సుమారు 4 వేల కోట్లకుపైగా విలువైన సర్కార్ ఆస్తుల్ని అమూల్‌కు ధారాదత్తం చేశారు. పాలసేకరణకు అవసరమైన యంత్రాలు, మౌలిక సౌకర్యాల్నీ ప్రభుత్వ నిధులతోనే సమకూర్చారు. అప్పు తెచ్చి మరీ నిర్మాణాలు చేయించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళల మెడపై కత్తి పెట్టి పాలసేకరణకు రోజువారీ లక్ష్యాలు విధించారు.
AP Govt Focus on Amul Dairy : కూటమి ప్రభుత్వ రాకతో వీరందరికీ స్వేచ్ఛ లభించింది. అమూల్‌కు పాల సేకరణ తగ్గుముఖం పట్టింది. గతంలో గరిష్ఠంగా రోజుకు 3 లక్షల 90 వేల లీటర్ల వరకూ వచ్చిన పాలు ఇప్పుడు 3 లక్షల లీటర్లు దిగువకు తగ్గిపోయాయి. ఫలితంగా అమూల్‌కు చెందిన సహకార సమాఖ్యలు పాలసేకరణ నిలిపేస్తున్నాయి. ధరల్లోనూ లీటరుకు 5 రూపాయలకు పైగా కోత పెట్టింది.
అమూల్ ముసుగులో గత ప్రభుత్వం 11,800 గ్రామాల్లో మహిళా సహకార పాల సేకరణ కేంద్రాల పేరుతో రూ.250 కోట్లు ఖర్చు చేసింది. సంఘానికి లక్షన్నర వెచ్చించి యంత్రాలు కొన్నారు. ఇప్పటికే 7 వేలకు పైగా గ్రామాలకు కేటాయించిన యంత్రాలు ఆర్‌బీకేలు, పశుసంవర్థక కార్యాలయాల్లో మూలనపడ్డాయి. ఇందులో భారీ ఎత్తున కమిషన్లు పొందారనే ఆరోపణలున్నాయి. ఇంత ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులైన అందరినీ శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
"జగన్ ప్రభుత్వం అమూల్ సంస్థకు ఎర్రతివాచీ పరిచింది. విజయ డెయిరీని అమూల్‌కు కట్టబెట్టారు. ప్రభుత్వమే నిధులు వెచ్చించి వారికి మౌలిక వసతలు సేకరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు వారు పాలసేకరణ చేయమని చేతులెత్తేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వీటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - నేతలు