Amigos Mining Royalty Receipts Scam : జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో మైనింగ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆ శాఖకు సమాంతరంగా కడపకు చెందిన గుత్తేదారు సంస్థ అమిగోస్‌కు రాయల్టీ వసూళ్లను అప్పగించారు. గత సర్కార్‌లో ఇసుక, మద్యం తరహాలోనే నగదు చెల్లింపులు మాత్రమే అనుమతిస్తూ క్వారీల యజమానుల నుంచి రాయల్టీని వసూలు చేశారు.
పెట్రేగిపోయిన అమిగోస్ సంస్థ :అప్పటి వరకు ఖనిజాభివద్ధిశాఖ రాయల్టీ చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగేవి. అమిగోస్ వచ్చిన తర్వాత స్వంతంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొని రాయల్టీని నగదు వసూళ్లతో ఇష్టానుసారంగా దోచుకున్నారు. మరోవైపు తమ పేరుతో రాయల్టీ రశీదు సృష్టించి ఇతర ప్రాంతాల క్వారీల నుంచి డోలమైట్ రవాణా చేస్తున్న లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు క్వారీ యజమానులు తెలిపారు.
"పెద్దవడుగురూలోని కిష్టపాడులో మైనింగ్ చేస్తున్నాం. అమిగోస్ సంస్థ వచ్చిన తర్వాత రాయల్టీ చెల్లింపులని నగదు రూపంలో స్వీకరించారు. మా పేరుతో ఇతరులకు అక్రమ రాయల్టీలు ఇచ్చారు. గతంలో రాయల్టీ చెల్లింపులన్ని ఆన్లైన్లో జరిగేవి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి మమల్ని ఆదుకోవాలని కోరుతున్నాం." - నాయుడు, క్వారీ యజమాని
Amigos Minerals Victims in Anantapur District :అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో డోలమైట్, స్టీటైట్ తవ్వకాలన్నీ భూగర్భ గనుల ద్వారానే జరుగుతున్నాయి. ఆయా చిన్న గనుల నుంచి ఏటా గరిష్టంగా 3500 టన్నులకు మించి తవ్వకాలు చేయలేరు. సుమారు 250 నుంచి 300 అడుగుల లోతు వరకు సొరంగ మార్గంలో వెళ్లి పనులు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే అందులోకి నీరుచేరి తవ్వకాలు నిలిచిపోతాయి.