ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిక్కడపల్లి పీఎస్‌లో ముగిసిన అల్లు అర్జున్‌ విచారణ - ఆ అంశాలపై ఆరా - ALLU ARJUN CASE UPDATES

సంధ్య థియేటర్ కేసులో విచారణకు హాజరైన అల్లు అర్జున్ - సోమవారం నోటీసులు ఇచ్చిన చిక్కడపల్లి పోలీసులు

ALLU_ARJUN
allu arjun (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2024, 10:35 AM IST

Updated : Dec 24, 2024, 3:09 PM IST

ALLU ARJUN CASE UPDATES : సంధ్య థియేటర్ కేసులో చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు 11.05 గంటలకు సినీ నటుడు అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.45 గంటల వరకు విచారణ సాగింది. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాతి పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్‌ను దాదాపు మూడున్నర గంటలకు పైగా ప్రశ్నించారు. ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్‌ సమక్షంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు.

తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే బెయిల్​పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్‌లో ప్రస్తావించిన అంశాలపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అల్లు అర్జున్‌ జూబ్లీహిల్స్‌ నివాసానికి బయలుదేరారు. ఒకే కారులో తన తండ్రి అల్లు అరవింద్‌తో చిక్కడపల్లి చేరుకున్నారు. వారితో పాటు అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు.

అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో జరిగిన రోజు పరిణామాల ఆధారంగా పోలీసులు ప్రశ్నించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ ద్వారాల వద్ద ఉన్న సాక్ష్యుల నుంచి వివరాలు సేకరించారు. దీని ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.

'అల్లు అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలే -​ రూ.10 లక్షల డీడీలు మాత్రమే పంపారు'

థియేటర్‌ యజమాన్యం నుంచి సమాచారం అందిందా ? :సంధ్య థియేటర్‌ సీనియర్‌ మేనేజర్‌ నాగరాజును ఇప్పటికే రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు. పుష్ప-2 ప్రీమియర్‌ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు సంబంధించిన అనుమతిని పోలీసులు తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా? లేదా అనే విషయంపైనా అల్లు అర్జున్‌ను నుంచి స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్‌ యజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా? అందినప్పటికీ మీరు ప్రిమియర్‌షోకు వచ్చారా? అనే విషయంపైనా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

ఘటన జరిగిన పరిణమాలపై అన్ని కోణాల్లో విచారణ నిర్వహించనున్న పోలీసులు, అల్లు అర్జున్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్‌ బౌన్సర్లు వ్యవహిరించిన తీరును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వ్యక్తిగత సిబ్బంది అభిమానులు తోసివేయడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆంటోని అనే బౌన్సర్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. నిబంధనల మేరకు బౌన్సర్లను నియమించుకున్నారా? లేదా అనే అంశంపైనా అల్లు అర్జున్‌ నుంచి వివరాలు రాబట్టారు. ఈ కేసులో మరికొంత మందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించాలని భావిస్తున్నారు.

పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. రెండ్రోజుల క్రితమే బౌన్సర్‌ ఆంటోని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 11 మంది అరెస్టు చేసిన పోలీసులు 18 మందిని నిందితులుగా చేర్చారు.

సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

Last Updated : Dec 24, 2024, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details