Alliance Leaders Election Campaign in Andhra Pradesh:ఎన్నికల వేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచారాల జోరు కొనసాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలును వివరించారు. సీఎం జగన్కు శవరాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని తండ్రి శవం అడ్డుపెట్టుకుని రాజకీయాలు ప్రారంభించారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలో 70 కుటుంబాలు ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పంచాయతీ తీర ప్రాంత గ్రామాల్లో ఎమ్మెల్యే బెందాళం అశోక్, జనసేన నేత దాసరి రాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు జరిగే మేలును వివరించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఈశ్వరరావు, విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు, జనసేన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు, డి.ఎల్.పురం గ్రామాల్లో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రచారం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనలో సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దయ్యాయని ప్రజలకు వివరించారు.
గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - అడుగడుగునా ప్రజాదరణ - Alliance leaders election campaign
కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్డీఏ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్ మాటను నమ్మి రాష్ట్ర ప్రజలంతా నష్టపోయారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండలో ఆయన ప్రచారం నిర్వహించారు. మౌలిక వసతులు కల్పించలేని ప్రభుత్వం కావాలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే తెలుగుదేశం కావాలో పట్టణ ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలోని అనాసాగరం గ్రామంలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు ఆమె వివరించారు.