Money Received from Telangana to APMDC :మీరు ఏదైనా సంస్థలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఆ సంస్థకు వచ్చిన ఆదాయంలో 5 వేలో, 10 వేలో డివిడెండ్‌గా ఇస్తారు. కానీ పెట్టుబడి కంటే అనేక రెట్లు డివిడెండ్‌గా ఎవరైనా ఇస్తారా? ఇదెక్కడైనా సాధ్యమేనా అంటే కచ్చితంగా సాధ్యమని చెబుతోంది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ. గతంలో ఆ సంస్థలో ప్రభుత్వం పెయిడ్ అప్ క్యాపిటల్‌గా పెట్టిన సొమ్ము కేవలం 6 కోట్ల 30 లక్షలు కాగా వరుసగా రెండేళ్లుగా 13 వందల కోట్ల మేర డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి ఇచ్చేశారు. సంస్థ భవిష్యత్తు అవసరాల కోసం కావాల్సిన నిధుల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా సొమ్మంతా సర్కారు చేతిలో పెట్టారు. జగన్ ప్రభుత్వానికి సంస్థ ఇన్‌ఛార్జ్ ఎండీ వెంకటరెడ్డి జీహుజూర్ అంటూ సంస్థ సొమ్మంతా డివిడెండ్ రూపంలో ఇచ్చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీఎండీసీ, తెలంగాణకు చెందిన టీఎస్‌ఎండీసీలకు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో పంపిణీ జరగకుండా నిలిచిపోయింది. ఇటీవల చర్చలు జరిపి ఈ సొమ్ము పంచుకునేందుకు అంగీకారం తెలిపారు. దీంతో ఏపీఎండీసీ వాటా కింద 840 కోట్లు వచ్చింది. ఇటీవల ఈ సొమ్మంతా ఏపీఎండీసీకి ఖాతాల్లోకి చేరింది. వెంటనే ఆ సొమ్ముతో పాటు, అదనంగా 60 కోట్లు కలిపి మొత్తం 900 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఇదేమంటే ప్రభుత్వానికి ఏటా డివిడెండ్ రూపంలో కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని అందుకే ఈ సొమ్ము ఇచ్చినట్లు బయటకు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ సర్కారుకు ఉండే ఆర్థిక అవసరాలకు ఆసరాగా నిలిచేందుకు వీలుగా ఏపీఎండీసీ సొమ్మును ఇలా ధారాదత్తం చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా ఏపీఎండీసీ డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి 400 కోట్లు చెల్లించింది. అంటే వరుసగా రెండేళ్లలో 13 వందల కోట్ల ఏపీఎండీసీ సొమ్ము ప్రభుత్వ పరమైంది.
ఏపీఎండీసీ నిధులపై జగన్ సర్కార్ కన్ను - 700 కోట్లు పక్కదారి పట్టించేందుకు సన్నద్ధం
ఏపీఎండీసీ 1961లో ఏర్పాటైంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 6కోట్ల 30 లక్షలు పెయిడ్ అప్ క్యాపిటల్‌గా ఇచ్చింది. సంస్థకు ఏ సంవత్సరమైనా ఆదాయం వస్తే.. పెయిడ్ అప్ క్యాపిటల్ విలువలోని 20 శాతం నుంచి 50 శాతం వరకు ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తున్నారు. కోటీ 26 లక్షల నుంచి 3 కోట్ల 15 లక్షల వరకు చెల్లించేవారు. ఇన్నేళ్లలో రెండు సార్లు మాత్రం 100 శాతం అంటే 6కోట్ల 30 లక్షలు, ఓ ఏడాది 200 శాతం అంటే 12 కోట్ల 60 లక్షలు డివిడెండ్‌గా ప్రభుత్వానికి ఇచ్చారు. అంతేగానీ ఎప్పుడూ ప్రభుత్వానికి వందల కోట్లు ఇచ్చిన దాఖలాల్లేవు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీఎండీసీ పూర్తిగా దాసోహమైంది. గత ఏడాది సంస్థకు మంగంపేట ముగ్గురాయి గనులు, మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు గనుల ద్వారా వచ్చిన రాబడి నుంచి 400 కోట్లు డివిడెండ్‌గా ప్రభుత్వానికి చెల్లించింది. ఇపుడు తెలంగాణ ఎండీసీ నుంచి వచ్చిన సొమ్ముతో కలిపి 900 కోట్లు కట్టబెట్టింది.