Adani Group Delegation Met Chandrababu :రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఐటీ, గనులు, పోర్టులు, పర్యాటకం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో ఏపీ సర్కార్‌తో కలసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.
అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్‌లు, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ సహా అదానీ గ్రూప్ నుంచి భారీ బృందం ఏపీకి తరలివచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానమైన ఆ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో తమ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ని వివరించారు. ఏయే రంగాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయో, వాటిలో తాము ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామో తెలియజేశారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో వారు వెల్లడించారు.
అదానీ గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అదానీ గ్రూప్ ప్రతినిధులతో సమావేశం వివరాల్ని ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే ఏపీ ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని తెలిపారు. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో ఏపీ దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్పారు.
అదానీ గ్రూప్ ముఖ్యమైన ప్రతిపాదనలు : రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చింది. ఇది వరకే సిద్ధం చేసిన ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి, ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయించిన డీపీఆర్‌కి తగ్గట్టే ఐఆర్‌ఆర్‌ని ఫేజ్-1, ఫేజ్-2లుగా ప్రతిపాదించింది. భవానీ ద్వీపం,రాజధాని సీడ్ యాక్సెస్రోడ్డు, కనకదుర్గ గుడి, బస్టాండ్, రైల్వేస్టేషన్లను కలుపుతూ రోప్‌వే నిర్మాణం చేపడతామంది. ట్రాఫిక్ స్టడీ తర్వాత అవసరమైతే అదనపు స్టేషన్లు నిర్మిస్తామని వెల్లడించింది.
ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు అందుబాటులోకి అత్యుత్తమ రోప్‌వే తీసుకువచ్చి, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ - డీబీఎఫ్ఓటీ మోడల్లో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. డీబీఎఫ్ఓటీ విధానంలో విశాఖలో సముద్రపు నీటి నుంచి రోజుకి 100 మిలియన్ లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంది. అప్పికొండ బీచ్ దీనికి అనుకూలమని ఇందుకు రూ.800 కోట్ల మేర పెట్టుబడి పెడతామని వివరించింది. సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ విధానంలో శుద్ధి చేసే టెక్నాలజీని ఉపయోగించి మంచి నీటి ఉత్పత్తి ప్లాంట్ నిర్వహణకు గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తామని తెలిపింది.
కృష్ణపట్నం, గంగవరం పోర్టుల విస్తరణ : కృష్ణపట్నం పోర్టు సామర్థ్యం 78 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులకు, ఇప్పుడున్న 13 బెర్తుల సంఖ్యను 42కి పెంచుతామని అదానీ గ్రూప్ తెలిపింది. పోర్టు విస్తరణకు మరో 2189.86 ఎకరాలు అవసరమని 1033 ఎకరాల అటవీ భూమికి తొలిదశ అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని వివరించింది. 775 ఎకరాల ఉప్పు భూముల కోసం ఏపీ మారిటైం బోర్డుకి ప్రతిపాదన వెళ్లిందని డీపీఐఐటీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరింది. దేవాదాయ భూములు 289.69 ఎకరాల సంబంధించి హైకోర్టులో వివాదాన్ని పరిష్కరించాల్సి ఉందని వెల్లడించింది.
గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ టన్నుల నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచుతామంది. 2022లో గంగవరం పోర్టు లిమిటెడ్ సేకరించిన భూముల్ని ఆపేరుతో ఉండేలా భూమి రికార్డులను మార్చాలని కోరింది. గతంలో కేటాయించిన 1800 ఎకరాల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న 217.57 ఎకరాలు తమకు అప్పగించాలని తెలిపింది. ఏపీఐఐసీ ద్వారా 5000ల ఎకరాల నుంచి 20,000ల ఎకరాలు కేటాయించి పారిశ్రామిక రాయితీలు కల్పిస్తే దేశంలోనే అతి పెద్ద పోర్టుల ఆధారిత పారిశ్రామికపార్కుల విస్తరణకు అవకాశం ఉందని స్పష్టంచేసింది.