A Series of Accidents in Pharma Industries : ఔషధ ఉత్పత్తుల తయారీలో కీలక యంత్రాలైన రియాక్టర్లు ఒత్తిడికి గురై పేలుడు సంభవిస్తే, ఆ ప్రమాద తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది. పేలుడు ధాటికి అధిక ఉష్ణోగ్రతతో మండుతున్న రసాయనాలు బయటకు చిమ్మడం, దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న వారు అగ్నికీలల్లో కాలిపోయో, శ్వాస ఆడకనో చనిపోతున్నారు. వీరిపై ఆధారపడ్డ కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయి.
Tension in Worker Families: ప్రమాదాల తర్వాత కంపెనీల యాజమాన్యాలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనతో ఫార్మా సంస్థల్లోని భద్రతపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫార్మా ఉత్పత్తుల తయారీలో రియాక్టర్లు కీలకం. ప్రతి బ్లాక్‌లో స్థల సామర్థ్యాన్ని బట్టి 10-18 రియాక్టర్లు ఉంటాయి. ఒక్కో రియాక్టర్ సామర్థ్యం 1 కేఎల్ నుంచి 8 కేఎల్ వరకు ఉంటుంది. ముడి రసాయనాలను రియాక్టర్‌లోకి పంపాక, అక్కడ జరిగే చర్యను బట్టి సరిపడా ఉష్ణం లేదా శీతలాన్ని పంపించి ఔషధాలను తయారు చేస్తారు.
ఈ క్రమంలో సరైన పర్యవేక్షణ లేకున్నా, రక్షణ చర్యలు తీసుకోకపోయినా వేడి పెరిగి రియాక్టర్లు ఒత్తిడికిలోనై భారీ శబ్దంతో పేలుతాయి. ఫార్మా ఉత్పత్తుల తయారీలో స్టీమ్ కూడా అవసరం. బొగ్గు ద్వారా బాయిలర్‌లో నీటిని మండించి స్టీమ్ తయారు చేస్తారు. అయితే బాయిలర్ ఆటోమేటిక్ వ్యవస్థతో పని చేస్తుంది. బాయిలర్లలో నీటి శాతం తగ్గి ఉష్ణోగత్ర ఎక్కువగా ఉంటే పేలుతుంది. సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. రసాయన పైపులైన్ల జాయింట్లు, వాల్వులు, సాల్వెంట్ ట్యాంకుల నుంచి ఎలాంటి లీకేజీలూ లేకుండా తనిఖీ చేయాలి. చిన్నపాటి లీకేజీలున్నా పెను ప్రమాదాలకు కారణమవుతాయి.