Fire Accident In RTC Bus At Nellore District:నెల్లూరు జిల్లా ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోట వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ వారు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ జరిగింది?: తిరుపతి నుంచి తిరువూరుకు వెళుతున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు రాత్రి 2:20 నిమిషాల సమయంలో మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద టీ తాగేందుకు నిలిపారు. కొందరు ప్రయాణికులు బస్సులో నుంచి పొగలు రావడం గమనించి మిగిలిన వారిని అప్రమత్తం చేసి బస్సు నుంచి దించేశారు. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు.
జగ్గయ్యపేటకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 11 మంది కుటుంబ సభ్యులతో విజయవాడకు వెళ్తున్నారు. అతను మంటలను చూసి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించేందుకు ప్రయత్నించినా స్పందన లేదని నాగేశ్వరరావు వాపోయారు. బస్సులో ఉన్న లగేజీ పూర్తిగా తగలబడిపోవడంతో ప్రయాణికులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.
ఉలిక్కిపడేలా చేసిన విజయవాడ బస్టాండ్ ఘటన - సీసీ టీవీలో ప్రమాద దృశ్యాలు
"అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో మన్నేటికోట అడ్డురోడ్డు వద్ద టీ తాగేందుకు నిలిపారు. ఆ సమయంలో మేమంతా బస్సులో నుంచి పొగలు రావడం గమనించి మిగతావారిని సైతం అప్రమత్తం చేసి బస్సు నుంచి దింపేశాం. తరువాత మంటలు క్రమంగా విస్తరించి బస్సు మొత్తం తగలబడిపోయింది" -ప్రయాణికులు
బాధితులను విజయవాడకు తరలింపు: బస్సు దగ్ధమైన ఘటనలో బాధితులను విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి స్వస్థలాలకు తరలించారు. బస్సు ప్రమాద బాధితులతో ఆర్టీసీ అధికారులు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఒంగోలుకు చెందిన కనకారావు అనే ప్రయాణికుడు బ్యాగులో ఉన్న నగదు మంటల్లో కాలిపోయింది.
ఆర్టీసీ ఛైర్మన్ దిగ్భ్రాంతి:ఆర్టీసీ బస్సు దగ్ధం కావడం దురదృష్టకరమని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు. ప్రమాదంలో ప్రయాణికుల సామన్లు మాత్రం కాలిపోయాయని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
అన్నకి బాయ్ చెప్పడానికి వచ్చి అనంత లోకాలకు - స్కూల్ బస్సు కింద నలిగిన చిన్నారి
ఆ రెండు రోడ్లు పూర్తయితే దూసుకుపోవడమే! - విజయవాడ తూర్పు బైపాస్ ఎక్కడినుంచి వెళ్తుందంటే!