ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరిగొచ్చిన ప్రాణం - విశాఖ కేజీహెచ్‌లో అరుదైన ఘటన

విశాఖ కేజీహెచ్​లో అరుదైన ఘటన

Rare Incident in Visakha KGH
Rare Incident in Visakha KGH (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 8:59 AM IST

Rare Incident in Visakha KGH :పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి గంపెడు ఆశలతో ఎదురుచూసింది. కడుపులో బిడ్డ కదులుతుంటే ఎంతో సంబురపడింది. పసిపాప రూపాన్ని కళ్ల ముందు తల్చుకుంటూ రోజూ మురిసిపోయింది. ప్రసవవేదనను భరించి ఓ శిశువుకు జన్మనిచ్చింది. కానీ తక్కువ బరువు ఉండటంతో ఆ బిడ్డకు వైద్యం అందించారు. ఈ క్రమంలోనే ఆ చిన్నారి ఊపిరి ఆడకపోవడంతో వైద్యులు ప్రాణం పోయిందని చెప్పారు. ఇది విన్న ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ పసికందును ఇంటికి తరలిచేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ సమయంలో శిశువులో కదలికలు రావడం గమనించిన వారు వైద్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చికిత్స అందించారు. ఈ అరుదైన ఘటన విశాఖపట్నం కేజీహెచ్​లో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖకు చెందిన ఓ గర్భిణి ప్రసవ వేదనతో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రి ప్రసూతి విభాగంలో చేరింది. వైద్యులు సిజేరియన్‌ చేసి ప్రసవం చేశారు. మగబిడ్డ జన్మించినప్పటికీ బరువు తక్కువగా ఉండడంతో అవసరమైన వైద్యసేవలు అందించారు. శనివారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో శిశువుకు ఊపిరి ఆడలేదు. విధుల్లో ఉన్న వైద్యులు పరిశీలించి ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు లబోదిబోమంటూ మృతశిశువును తరలించేందుకు సిద్ధమయ్యారు.

అదే సమయంలో శిశువులో కదిలికలు రావడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. స్పందించిన వైద్యులు వెంటనే శిశువును పీడియాట్రిక్‌ విభాగంలోని ఎన్‌ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ బిడ్డ విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.శివానంద వివరణ కోరగా తక్కువ బరువుతో పుట్టే శిశువులు అరుదుగా ఊపిరి బిగబెట్టి ఉండిపోతారని, దీన్ని ఆంగ్లభాషలో "ఎపెనిక్‌ స్పెల్"​గా పరిగణిస్తామని చెప్పారు. ఈ కేసు విషయంలో అదే జరిగిందన్నారు. ప్రస్తుతం శిశువుకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని దీనిపై విచారణ జరిపిస్తామని డాక్టర్‌ పి.శివానంద వెల్లడించారు.

పసికూన కోసం- ఆక్సిజన్​ సిలెండర్​తో తండ్రి పరుగులు - ​ వీడియో వైరల్​ - Father Holding Oxygen Cylinder

కంట్లో కొయ్య- శస్త్రచికిత్సతో మళ్లీ కంటి చూపు- KGH వైద్యుల ఘనత - Rare Surgery in KGH at Visakha

ABOUT THE AUTHOR

...view details