76th National Conference on Radiology and Imaging: వైద్య రంగంలో రేడియాలజీకి ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలో జబ్బులను, సమస్యలను గుర్తించి రోగికి ఖచ్చితమైన వైద్యం అందించటంలో రేడియాలజిస్ట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. కాన్సర్ లాంటి ధీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి.. రోగికి సరైన చికిత్స అందించేందుకు స్కానింగ్ తోడ్పడుతోంది.
గతంలో మనిషిని నిశితింగా పరిశీలించి జబ్బును కొంత ఊహించి వైద్యచికిత్స అందించే వాళ్లు. ప్రస్తుతం అత్యాధునిక పరిజ్ఞానంతో వస్తున్న సీటీ, ఎమ్మారై,పెట్ స్కానింగ్ వినియోగిస్తున్నారు. భవిష్యత్లో కృత్రిమమేథస్సు పరిజ్ఞానాన్ని జోడించి మరింత ఖచ్చితత్త్వాన్ని అందించే పరికరాలు అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయాలై ఆసుపత్రికి వెళితే ఎక్స్ రే, స్కానింగ్ తీస్తేనే శరీరంలో ఎక్కడెక్కడ గాయాలయ్యాయో తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యులు రోగాన్ని నిర్ధారించి వైద్యం అందించాలంటే రేడియాలజిస్ట్ పాత్ర కీలకంగా ఉంది. రేడియాలజీ విభాగం అంటే కేవలం ఫిల్మ్ పై ఫొటోలను తీయటమే కాదు.. రోగాన్ని నిర్ధారించే విధంగా ఇమేజ్ను తీయటమని ప్రముఖ రేడియాలజిస్ట్లు తెలిపారు. రేడియాలజిస్ట్ అండ్ ఇమేజింగ్ 76వ జాతీయ సదస్సును నాలుగు రోజుల పాటు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించారు.
సూది గుచ్చకుండానే షుగర్ టెస్ట్- ఏపీ ఉంగుటూరువాసికి పేటెంట్ రైట్స్ ఇచ్చిన కేంద్రం
దేశ నలుమూలల నుంచి మాత్రమే కాక రష్యా, యుఎస్ఏ, జపాన్ దేశాల నుంచి సైతం రేడియాలజిస్ట్లు సదస్సులో పాల్గొన్నారు. గతంలో ఎక్స్రే ఆధారంగానే వైద్యులు రోగులకు వైద్యాన్ని అందించే వాళ్లు. ఒక్కోసారి రోగి శరీరంలో నొప్పి ఎక్కడ వస్తుందో అక్కడ తడిమి సమస్యను ఊహించి చికిత్స చేయాల్సి వచ్చేదని రేడియాలజిస్ట్లు చెప్పారు. ప్రస్తుతం ఎక్సరే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, సిటి స్కాన్, సిటీ యాంజియో, ఎమ్మారై స్కాన్,పెట్ స్కాన్ లాంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జాతీయ సదస్సు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
రేడియాలజీ రంగంలో వినూత్న మార్పులు వచ్చాయి. కృత్రిమ మేథస్సు పరిజ్ఞానాన్ని విదేశాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్నారు. భవిష్యత్లో ఇండియాలో కూడా అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వైద్యులు గుర్తించని చిన్న చిన్న ఫ్రాక్చర్స్ లాంటి వాటిని ఏఐ(Artficial Inteligence) ద్వారా గుర్తించవచ్చని రేడియాలజిస్ట్లు తెలిపారు. ప్రముఖ కంపెనీలు అధునాతన పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ జాతీయ సదస్సు ఉపయోగపడుతుందని నూతన వైద్య విద్యార్థులు చెబుతున్నారు.
రామాయణం, హనుమాన్ చాలీసాతో గుండె వైద్యం- డాక్టర్ వినూత్న చికిత్స