ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాము కాటుకు ఏటా 50వేల మంది బలి- కాటు వేయగానే ఏం జరుగుతుందంటే! - SNAKE BITE TREATMENT - SNAKE BITE TREATMENT

People Die due to Snake Bite: అంతుచిక్కని రోగాలకు సైతం మందులు లభిస్తున్న ఆధునిక కాలం ఇది. నయం కాదు అనుకున్న వ్యాధులకు సైతం చికిత్స లభిస్తున్న రోజులు. మరి వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందినా దేశంలో పాము కాటు మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏటా 50వేల మంది దీని వల్ల మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటి వల్ల అత్యధిక మరణాలు భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఏకంగా 30లక్షల నుంచి 40లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. మరి ఈ స్థాయిలో సర్పాలు విజృంభించడానికి కారణం ఏమిటి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్లే ఇలా జరుగుతోందా. ఏం చేస్తే పాము కాట్లను తగ్గించవచ్చు.

Snake Bite Treatment in Telugu
Snake Bite Treatment in Telugu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 12:40 PM IST

Thousands of People Die Every Year due to Snake Bite :వర్షాలు జోరుగా కురుస్తూ ఉండడంతో దేశంలో వ‌్యవసాయ పనులూ అదే రీతిగా సాగుతున్నాయి. రైతులు ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఐతే ఆ ఉత్సాహంపై పాము కాట్లు నీళ్లు చల్లుతున్నాయి. దేశంలో పాములు రైతులను పొలాల్లోనే బలి తీసుకుంటున్నాయి. ఎక్కువగా రైతులే పాము కాటు వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉండగా, అనేక ఇతర వర్గాల ప్రజలు కూడా చనిపోతున్నారు. ప్రతి ఏటా 50వేల మంది దీని వల్ల ప్రాణాలు విడుస్తున్నారు.

Snake Bite Treatment in Telugu : ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇదే అంశాన్ని భాజపా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ లోక్‌సభ వేదికగా ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం 30లక్షల నుంచి 40లక్షల మంది వీటి బారిన పడుతున్నారని వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో పాము కాటు బారిన పడడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందినా మరణాలు పెరగడం కలవరపెడుతోంది. ఎక్కువగా వానాకాలంలోనే పాము కాట్లు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయ పనులు పుంజుకోవడం, పాములు ఎక్కువగా ఈ కాలంలోనే సంచరించడం వల్ల ఇవి జరుగుతున్నాయి.

విషం ఉన్న పాములు ఐదే : సాధారణంగా పాములు ఇతరుల కంట పడకుండా ఉండేందుకే ప్రయత్నిస్తాయి. కాని తమకు భంగం కల్గినా, ప్రమాదం పొంచి ఉందని భావించినా కాటు వేస్తాయి. కోరలతో కాటు వేసి విషాన్ని వెదజల్లుతాయి. ఇది రక్తంలోకి వెళితే తీవ్ర ప్రమాదం జరుగుతుంది. పాము రకాలను బట్టి క్రమంగా శ్వాసకోశ వ్యవస్థ కుప్పకూలవచ్చు. రక్తస్రావం కావచ్చు. షాక్‌లోకి వెళ్లవచ్చు. అవయవాలు విఫలం కావడం లేదా ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

మీకు తెలుసా? పాము కరిచినప్పుడు ఇలా చేస్తే ప్రాణాలు రక్షించొచ్చు!

మన దేశంలో చాలా రకాల పాములు ఉన్నప్పటికీ మనిషిని చంపగలిగేంత విషం ఉన్నవి ఐదే. తెలుగు రాష్ట్రాల్లోనైతే మూడే. అవి తాచు పాము, కట్ల పాము, రక్తపింజర. వాస్తవానికి పాము కాటు మరణాలు నివారించదగ్గవే. పాము కరిచిన వారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించడం, ధైర్యం కల్పించడం ద్వారా చాలా మందిని బతికించుకోవచ్చు. పాము కరవగానే కొందరు ఇక చనిపోతున్నామని తమకు తాము తీర్మానించుకుంటారు. ఐతే ఇలాంటి వారికి కుటుంబ సభ్యులు తాము అండగా ఉన్నామనే భరోసాను కల్పించాలి. పాము విషానికి విరుగుడు ఇంజక్షన్లు ఉన్నాయని, వైద్యుల వద్దకు వెళితే ప్రాణాపాయం నుంచి బయటపడతామని అర్థం అయ్యేలా వివరించాలి. చికిత్సతో బయటపడిన వారిని గుర్తు చేయాలి.

తాచు, కట్ల పాములు : తాచు, కట్ల పాముల విషాలు నాడుల పనితీరును దెబ్బతీస్తాయి. నాడుల నుంచి కండరాలకు సంకేతాలు అందవు. దీంతో కళ్లు మూత పడడం, చూపు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ కండరాలు పని చేయకపోవడం వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవచ్చు. ఫలితంగా రక్తంలో ఆక్సిజన్‌ తగ్గిపోయి గుండె, మెదడు స్తంభించిపోవచ్చు. ఇదంతా జరగకముందే చికిత్సను ప్రారంభించాలి.

రక్తపింజర పాము చాలా ప్రమాదకరం : ఇక రక్తపింజర పాము కరిస్తే రక్తం గడ్డకట్టే స్వభావం దూరం అవుతుంది. దీంతో శరీరంలో ఎక్కడపడితే అక్కడ రక్తస్రావం అవుతుంది. కడుపులో రక్తస్రావం అయితే రక్త వాంతి కావచ్చు. మూత్రంలో రక్తం పడవచ్చు. కరిచిన చోట, కళ్లల్లో నుంచి రక్తస్రావం కావచ్చు. ఇది చాలా ప్రమాదకరం. పాము కరిచిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చినపుడు ముందుగా స్పృహలో ఉన్నారా, నాడి ఎలా కొట్టుకుంటోంది, బీపీ ఎలా ఉంది, శరీరంలో విషం తాలూకు లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేవి చూస్తారు. విష లక్షణాలు లేనపుడు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. వీరికి రక్తనాళం ద్వారా నెమ్మదిగా సెలైన్‌ ఎక్కిస్తారు. నోటి నుంచి ఎలాంటి ఆహారం ఇవ్వరు.

పాము కరచిన వారికి సీబీపీ, రక్తం గడ్డకట్టే సమయం, రక్తంలో క్రియాటినిన్‌, గ్లూకోజును పరీక్షించడం సహా మూత్ర పరీక్షలు అవసరం అవుతాయి. వీటిలో రక్తం గడ్డకట్టే సమయం చాలా కీలకం. రక్తపింజర కరిచిన వారికి శరీరంలో ఎక్కడపడితే అక్కడ రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే గంటకు ఒకసారి రక్తం గడ్డకట్టే సమయాన్ని పరీక్ష చేసి పరిశీలించాల్సి ఉంటుంది. ఇది నార్మల్‌గా ఉంటే 24గంటల తర్వాత ఇంటికి పంపిస్తారు.

తాచు పాము, కట్లపాము కరిచిన వారికి పరీక్ష ఫలితాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. కాని రక్తంలో క్రియాటిన్‌, గ్లూకోజు వంటివి తెలుసుకోవడానికి ఈ కనీస పరీక్షలు అవసరం. తాచు పాము, కట్లపాము కరిచిన వారు తమంతట తాము శ్వాస తీసుకోగల్గితే పూర్తిగా కోలుకున్నట్టే. రక్తపింజర కరిచిన వారు రక్తం గడ్డకట్టే స్వభావం మామూలు స్థితికి చేరుకుంటే 90శాతం వరకు ప్రమాదం నుంచి బయటపడినట్లు భావించాలి. వీరిలో కొందరికి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రెండు మూడు రోజుల వరకు క్రియాటిన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. ఇది నార్మల్‌గా ఉంటే ప్రమాదం తప్పినట్టే. రక్తపింజర కరచిన చోట వాపు వస్తుంది. కొందరికి ఆ భాగం కుళ్లిపోవచ్చు. అక్కడ కోతపెట్టి, కట్టుకట్టి యాంటీ బయాటిక్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది.

వర్షాకాలంలో ఇళ్ల చుట్టూ పాములు తిరుగుతుంటాయ్ - కాటేస్తే వెంటనే ఇలా చేయండి! - Immediate Precautions to Snake Bite

రక్తపింజర V/S తాచు, కట్ల పాము : పాము కాటు వల్ల విష ప్రభావం మొదలైనా, ఆసుపత్రిలో చేరిన తర్వాత విష లక్షణాలు మొదలైనా యాంటీ స్నేక్ వీనమ్‌ ఇంజక్షన్లు ఏఎస్​వీ ఇవ్వడం ఆరంభిస్తారు. శరీరం లోపల ప్రవహిస్తున్న విషాన్ని వీలైనంత త్వరగా నిర్వీర్యం చేయడం చాలా ముఖ్యం. అందుకే వెంట వెంటనే 10 మోతాదుల ఏఎస్​వీ ఇంజక్షన్లను ఇస్తారు. సాధారణంగా సెలైన్‌లో ఏఎస్​వీని కలిపి ఎక్కించాలని భావిస్తూ ఉంటారు. కాని నేరుగా రక్తనాళం ద్వారా ఇస్తేనే సత్వర గుణం కనిపిస్తున్నట్లు అనుభవాలు చెబుతున్నాయి. ఎవరికైనా 10మోతాదులతో ఫలితం రాకుంటే మరో 10మోతాదుల ఇంజక్షన్లు అవసరం అవుతాయి.

రక్తపింజర కరిస్తే 30మోతాదుల ఏఎస్​వీని ఇవ్వాల్సి రావచ్చు. సాధారణంగా ఏఎస్​వీ ఇచ్చిన 24 గంటల నుంచి 48 గంటల తర్వాత పరిస్థితి కుదుటపడుతుంది. తాచుపాము కరిచిన వారిలో అయితే నాలుగైదు గంటల్లోనే మంచి ప్రభావం కనిపిస్తుంది. కట్లపాము కాటుకు గురైన వారిలో ఒకటి నుంచి మూడు రోజుల సమయం పట్టవచ్చు. రక్తపింజర కరిచిన వారిలో రక్తం గడ్డకట్టే స్వభావం తిరిగి రావడానికి కనీసం ఆరుగంటల సమయం పడుతుంది. తాచు, కట్ల పాము కరిచిన వారికి శ్వాస ఆగిపోయే పరిస్థితి ఉంటే వెంటిలేటర్‌ సాయంతో కృత్రిమ శ్వాస అందించాల్సి ఉంటుంది. వెంటిలేటర్‌ సాయం లేకుంటే యాంబూ బ్యాగును చేత్తో వత్తుతూ శ్వాస కల్పించాల్సి ఉంటుంది.

పాముల ఆవాసాల ధ్వంసాన్ని ఆపాలి :సాధారణంగా పాములు అడవులు, పొదలు, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటాయి. ఐతే అడవులు క్రమంగా తగ్గిపోవడం వల్ల పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనికి తోడు పారిశ్రామికీకరణ వల్ల నీటి కాలుష్యం పెరగడంతో అవి బయట తిరుగుతున్నాయి. అందువల్ల పాముల బెడద తగ్గాలంటే అడవులను విచ్చలవిడిగా నరకడాన్ని ఆపేయాలి. నీటి కాలుష్యాన్ని తగ్గించాలి. పాముల ఆవాసాల ధ్వంసాన్ని ఆపాలి. ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్‌ ఇంజక్షన్లు తగినన్ని అందుబాటులో ఉంచాలి. పాము కరచినపుడు నాటు వైద్యం, మంత్రవైద్యం కాకుండా తప్పనిసరిగా ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదు. ధైర్యం అత్యావశక్యం. అందువల్ల పాము కాట్లు, వాటి వల్ల సంభవిస్తున్న మరణాలు ఆపాలంటే ఈ సూత్రాలన్నింటిని పాటించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

పాముకాటుకు విరుగుడు- ల్యాబ్​లో యాంటీబాడీల అభివృద్ధి- బెంగళూరు శాస్త్రవేత్తల ఘనత!

ABOUT THE AUTHOR

...view details