Not Paying SSC Exam Fee in AP :రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు కట్టే గడువు ముగిసింది. అపరాధ రుసుము రూ.500లతో కూడా ఈ నెల 16కి ముగిసిపోయింది. కానీ డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వివిధ పాఠశాలల్లో పదో తరగతిలో ఈ విద్యా సంవత్సరంలో నమోదైన 362 మంది ఎగ్జామ్స్ రాయడానికి ఫీజు కట్టలేదు. ఇందులో 122 మంది బాలికలు, 240 మంది బాలురు ఉన్నారు.
వాస్తవానికి వీరంతా మార్చి నెలలో జరిగే పదో తరగతి పరీక్షలు రాయాలి. రుసుము గడువు తీరేటప్పటికి జిల్లాలో 143 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 362 మంది ఫీజు చెల్లించలేదు. అంటే వారు పరీక్ష రాయడానికి రావడం లేదు. వాస్తవానికి సెప్టెంబర్ 29నాటికి ఈ పాఠశాలల్లో 5031 మంది బాలురు, 4628 బాలికలతో మొత్తం 9659 మంది ఉండేవారు. డిసెంబర్ 18 నాటికి వీరి సంఖ్యలో బాలురు 4791 మంది, బాలికలు 4506 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా 10వ తరగతి వారే.
మరి ఎందుకు ఈ తేడా వచ్చింది. వారి పరీక్ష ఫీజును ప్రధానోపాధ్యాయులు ఎందుకు చెల్లించలేదని రాష్ట్ర విద్యాశాఖ ఆరా తీస్తోంది. అపుడు నమోదైన వీరందరితోనూ పరీక్ష ఫీజు కట్టించలేకపోవడం తీవ్ర అంశంగా పరిగణిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీరి సంఖ్య ఎందుకు తగ్గిందో, వారి ఫీజు ఎందుకు కట్టలేదో సరైన కారణాలు చెబుతూ ప్రధానోపాధ్యాయులు ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఆయా పాఠశాలలకు తాఖీదులు పంపారు.