Anantapur Nadimivanka People Problems Due To Flood Water :కరవు ప్రాంతమైన అనంతపురంలోని దృశ్యాలు లంక గ్రామాలను తలపిస్తున్నాయి. నగరంలో సుమారు 8 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న నడిమివంక అనంత వాసులకు ఈ దుస్థితి కల్పిస్తోంది. ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడం, నిర్వహణ లోపం వీరి పాలిట శాపంగా మారింది.
2022 అక్టోబర్‌లో నడిమివంక అనంతపురాన్ని ముంచెత్తింది. రంగస్వామి నగర్, రజక నగర్, సోమనాథ నగర్ తదితర కాలనీల్లోని ప్రజలు సర్వస్వం కోల్పోయారు. అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తక్షణమే ఆక్రమణలు తొలగించి రక్షణ గోడ నిర్మిస్తామని బాధితులకు హామీలిచ్చారు. తమ కష్టాలు తీరతాయని బాధితులు సంబరపడ్డారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కనీసం ఏ రోజూ ముంపు కాలనీల వైపు కన్నెత్తి చూడలేదు. గడచిన రెండేళ్లలో వేసవి సీజన్‌లో కనీసం పూడికతీత పనులు కూడా చేయలేదు.
నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో ప్రజలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పట్టం కట్టినా పాలకులు బాధితులకు ముప్పు తప్పించలేకపోయారు. ఫలితంగా వంక పొంగినప్పుడల్లా కట్టుబట్టలతో పరుగులు తీయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడిమివంకను ఆక్రమించి పలువురు పెద్దపెద్ద భవనాలు కట్టారు. దానివల్లే వంక మాటిమాటికీ పొంగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణలు తొలగించి తమను కాపాడాలని కోరుతున్నారు.