YSRCP MLCs Resign: వైఎస్సార్సీపీకి సొంత పార్టీ నేతలే దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అధినేత జగన్ తీరుతో వేగలేం అంటూ ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు వారి పదవులతో సహా పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామాలు చేశారు. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్లి కల్యాణ్ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. వారిద్దరూ శాసన మండలి ఛైర్మన్ కు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించారు. కల్యాణ్ చక్రవర్తికి సుమారు మూడేళ్లు, పద్మశ్రీకి మరో ఐదేళ్ల వరకు పదవీకాలం ఉన్నప్పటికీ వారిద్దరూ రాజీనామా చేశారు. గౌరవం, విలువలేని చోట ఉండలేకే వైఎస్సార్సీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినట్లు వారు తెలిపారు.
మొత్తం 58 మంది సభ్యులుండే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇప్పటికే మూడు ఖాళీలు ఉన్నాయి. మిగిలిన 55మందిలో వైఎస్సార్సీపీకి అత్యధికంగా 42 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీకి 9మంది, జనసేన కు ఒకరు, పీడీఎఫ్ నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఈ నెల 28న పోతుల సునీత, తాజాగా కల్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైకాపా సభ్యుల సంఖ్య 39కి పడిపోయింది. ఒకటి, రెండు రోజుల్లో ఒక మహిళా ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత రాజీనామా బాటలో మరికొందరు కూడా ఉన్నట్లు సమాచారం.