Village Volunteers Working as YSRCP Activists : సర్కారీ సేవలను గడప గడపకూ చేర్చే స్వచ్ఛంద సేవకులంటూ వాలంటీర్ల వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి సృష్టించారు. పూర్తిగా ప్రజాధనంతోనే వాలంటీర్లను పెంచి పోషించిన జగన్ వారితో సొంత పార్టీ పనులు చేయించుకున్నారు. తమ చీకటి వ్యవహారాలన్నింటినీ వాలంటీర్ల చేతుల మీదుగానే జరిపించారు. సేవాదృక్పథం కలిగిన యువతీ, యువకులను వాలంటీర్లుగా నియమించామని, వారు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. కానీ, వాలంటీర్లు వైఎస్సార్సీపీ కార్యకర్తలేనని పార్టీ అవససరాల కోసమే నియమితులయ్యారని జగన్ రాజకీయ కుట్రను ఆయన వందిమాగధులు, మంత్రులు, ఎమ్మెల్యేలే బయటపెట్టారు.
Volunteers in CM Jagan Service :సంక్షేమ పథకాలకు అర్హులెవరో గుర్తించడం అనేది సర్కారీ సిబ్బంది నిష్పాక్షికంగా నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత. తనకోసం, తనచేత నియమితులైన వాలంటీర్లకు దాన్ని కట్టబెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధమైన పాలనను జగన్ పెళ్లగించి పారేశారు. వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారికి సర్వీస్ రూల్స్ ఉన్నాయా? అసలు ప్రభుత్వ ఉద్యోగులేనా? లబ్ధిదారుల ఎంపికలో వారి జోక్యమేంటి? అని సాక్షాత్తూ హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధించింది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానేకారు! ఆ విషయం జగనే తేల్చి చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి తద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను చావుదెబ్బ తీశారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు.
జగన్ దొంగ రాజకీయాలకు ఒక పనిముట్టుగా వాలంటీర్ల వ్యవస్థబాగా ఉపయోగపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని వాలంటీర్లు జనాన్ని ప్రభావితం చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లోనైతే వైఎస్సార్సీపీ తరఫున ఇంటింటి ప్రచారమూ చేశారు. నెల్లూరు జిల్లా సంగంలోనైతే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు వాలంటీర్లతో వైఎస్సార్సీపీ నేతలు రహస్యంగా భేటీ వేశారు.
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచమని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ ఉత్తర్వులకు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్లో కొందరు వాలంటీర్లే కీలకపాత్ర పోషించారు. సీఎం సభలకు రానివారికి సంక్షేమ పథకాలను తొలగిస్తామని లబ్ధిదారులను బెదిరించి మరీ బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఇలా వైసీపీ జెండాలు మోయించడం కోసం ఏడాదికి దాదాపు 1900 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాలంటీర్లకు ధారపోశారు జగన్.