Modi new cabinet : కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురికి చోటుదక్కింది. వీరిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాగా, మరొకరు బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు కేబినెట్ హోదా కల్పించనుండగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి హోదా దక్కనుంది. ప్రధానితో పాటు రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాసవర్మ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పదవులు దక్కిన నేపధ్యంలో చంద్రబాబు నాయుడు రామ్మోహన్‌నాయుడుకి, పెమ్మసానికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలంగాణ నుంచి కేంద్రమంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు పిలుపు అందింది. పీఎంవో పిలుపుతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మోదీ నివాసానికి వెళ్లారు.
కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలు - రామ్మోహన్, పెమ్మసాని ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం? - TDP Central Cabinet Minister
హ్యాట్రిక్ విజయాలతో రికార్డు :ఎర్రన్నాయుడి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. తాజా ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలుగు, హిందీ, ఆంగ్లంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడికి ప్రావీణ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో జన్మించిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రస్తుత వయస్సు 36 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ బాబాయి. బీటెక్, ఎంబీఏ పూర్తిచేసిన రామ్మోహన్‌నాయుడు బండారు సత్యనారాయణ కుమార్తె శ్రావ్యను వివాహం చేసుకున్నారు. రామ్మోహన్‌నాయుడి తండ్రి ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా పనిచేశారు. 1996లో కేంద్రగ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేశారు.
కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వర్మ :పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి వర్మ విజయం సాధించారు. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 1997 నుంచి 99 వరకు ఉమ్మడి ప.గో. జిల్లా బీజేపీ కార్యదర్శిగా పనిచేసిన వర్మ.. 1999 నుంచి 2001 వరకు నరసాపురం పార్లమెంట్ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2001 నుంచి 2003 వరకు జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన వర్మ 2009లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీచేశారు. 2010 నుంచి 2018 వరకు ఉమ్మడి ప.గో. జిల్లా అధ్యక్షుడిగా, 2018 - 2020లో జిల్లా ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి 23 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వర్మ తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.
మోదీ 3.0కు సర్వం సిద్ధం- కీలక పదవులు బీజేపీకే! మరి మిత్రపక్షాలకు? - PM Modi Oath Ceremony
అమెరికాలో వైద్యుడిగా :తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్రమంత్రి పదవి వరించింది. గుంటూరు టీడీపీ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం. పెమ్మసాని చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. అమెరికాలో ఎండీ పూర్తి చేసిన వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చేందుకు 'యు వరల్డ్' సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం పెమ్మసాని చంద్రశేఖర్ వయస్సు 47 సంవత్సరాలు. ఆయన భార్య శ్రీరత్న కూడా వైద్యురాలే.
మహాత్మా గాంధీ, వాజ్‌పేయీకి మోదీ నివాళులు- కాబోయే కేంద్ర మంత్రులు వీరేనా? - Modi Oath Ceremony