Clashes Between YSRCP Leaders : జగన్ తర్వాత నంబర్ 2 స్థానం కోసం వైఎస్సార్సీపీలో ఎప్పటి నుంచో పోటీ పడుతున్న కీలక నేతల మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. అధికారం పోవడంతో ఇన్నాళ్లూ వారి మధ్య సాగిన ఆధిపత్య పోరు బజారున పడుతోంది. పార్టీలో నంబర్ 2 మా నాయకుడే, ఇంకెవరున్నారంటూ ఆ స్థానం కోసం పోటీ పడుతున్న ముఖ్య నేతల వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ నాయకులు వారి స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తమ పోటీదారుల గుట్టుమట్లను బయట పెట్టిస్తూ వారిని అభాసుపాలుచేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
కీలక నేతల్లో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం : కీలక నేతల్లో ఇద్దరి మధ్య పార్టీలో చాలాకాలంగా ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. వీరిలో మొదటి నేత వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్తగానే కాక ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం, తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన రెండో నేత మొదట పార్టీ కార్యాలయ బాధ్యతలు పొందారు. తన కుమారుడికి పార్టీ సామాజిక మాధ్యమ ఇంఛార్జ్ పదవిని దక్కించుకున్నారు.
ఉన్న మూడు పోస్టుల్లో రెండు పోవడం మొదటి నేతకు రుచించలేదు. రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా నాయకులను కలుస్తానంటూ రోజూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి రావడం ప్రారంభించారు. పార్టీ కార్యాలయ బాధ్యత తీసుకున్న రెండో నేత మరోచోట కార్యాలయం పెట్టి, కార్యకలాపాలు సాగించారు. జగన్ వద్ద ప్రాపకాన్ని పెంచుకోగలిగారు. ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్, సమావేశాలు నిర్వహిస్తూ వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. దీనికి ఎలాగైనా గండికొట్టాలని భావించిన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త అనుబంధ విభాగాలనూ తన కిందకు తెచ్చుకుని వారితో భేటీలు నిర్వహించారు. దిల్లీలో చక్రం తిప్పుతూ జగన్ నమ్మకాన్ని చూరగొనేందుకు ప్రయత్నించారు.
Internal Disputes Between YSRCP Leaders :పార్టీ కేంద్ర కార్యాలయం, సామాజిక మాధ్యమ బాధ్యతలను లాగేసుకున్న నేత, మొదటి నేత వద్ద ఉన్న పార్టీ రాష్ట్ర సమన్వయ బాధ్యతనూ పొందగలిగారు. మొదటి నేత దాన్ని తిరిగి దక్కించుకోవడంతో అది వారం రోజుల ముచ్చటే అయింది. అయితే ఆయన కాగితంపైనే సమన్వయకర్త అన్నీ నేనే అంటూ రెండో నేత చక్రం తిప్పారు. తనకు అడ్డుతగిలిన నాయకుడిని ఉత్తరాంధ్ర పార్టీ ఇంఛార్జ్ బాధ్యత నుంచి తప్పించగలిగారు.
ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి, నేతల మధ్య పంచాయితీల సర్దుబాటు వరకు రెండో నేత అన్నింటిలోనూ తలదూర్చి ప్రాబల్యాన్ని చాటుకున్నారు. ఎన్నికల ముందు చాలామంది ఎమ్మెల్యేలు, నాయకులు వెళ్లిపోవడానికి, పార్టీ ఘోర పరాజయానికీ ఆయన తప్పిదాలే ప్రధాన కారణమని అన్ని వేళ్లూ ఆయనవైపే చూపించేలా మొదటి నేత చేయగలిగారు. దీంతో రెండో నేత ఇప్పుడు మొదటి నాయకుడి వ్యక్తిగత వ్యవహారాలను బయట పెట్టించారనే చర్చ వైఎస్సార్సీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.