Neha Reddy Illegal Construction at Bhimili Beach: విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద వైకాపా నేత విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుందని జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడలో కొంత భాగాన్ని కూల్చామని జీవీఎంసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఖర్చులు ఎవరు భరించారని న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. జీవీఎంసీ ఖర్చులతోనే కూల్చామని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఖర్చయిన బిల్లులను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. మిగిలిన నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. భీమిలి బీచ్ వద్ద ఉన్న నిర్మాణాల్లో కొన్ని పాతవి కూడా ఉన్నాయని సంబంధిత యజమానులకు మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులిచ్చినట్లు జీవీఎంసీ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
GVMC Shock for Vijaya Sai Reddy:YSRCP అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులు విశాఖ కేంద్రంగా పెద్ద ఎత్తున భూదందా నిర్వహించారు. భూములను దౌర్జన్యంగా పెద్ద స్థాయిలో ఆక్రమించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారని పౌర సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, మరికొందరు ఇతర పార్టీల నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భీమిలి సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523 లో ఉన్న స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. CRZలో అక్రమ నిర్మాణాలుపై మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. పిల్ నెంబర్ 53/2024లో నిర్మాణాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందుంచారు.
విజయసారెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాలతో పాటు ఇతర పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిర్ధారించింది. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అధికారులు ఈ కూల్చివేత ప్రక్రియ నిర్వహించారు. కూల్చివేతల పట్ల విశాఖపట్టణం నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. YSRCP నాయకులు పాల్పడిన మరిన్ని భూఅక్రమాలపై చర్యలు తీసుకోవాలని వారంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది - విజయసాయిరెడ్డికి జీవీఎంసీ షాక్ - అక్రమ నిర్మాణం నేలమట్టం - GVMC shock for vijaya sai Reddy