Chandrababu And Pawan Kalyan Election Campaign :సీఎం జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని ఉమ్మడి ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు కలిశాయి : చంద్రబాబు మాట్లాడుతూ సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కల్యాణ్ అని అభినందించారు. తనకు అనుభవం ఉందని, పవన్‌కు పవర్ ఉందని అన్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు ప్రజాగళానికి వారాహి తోడైందని, అహంకారాన్ని బూడిద చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు కలిశాయని, సైకిల్ స్పీడ్‌కు తిరుగులేదని, గ్లాస్ జోరుకు ఎదురు లేదని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకొట్టుకుపోవడం ఖాయమని అన్నరు. వ్యక్తిగత దాడులు తట్టుకుని పవన్ నిలబడ్డారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదట చెప్పిన వ్యక్తి పవనేనని, చీకటి పాలన అంతానికి ఓటు చీలకూడదని గుర్తు చేశారు.
వాలంటీర్లకు భరోసా :అధికారం అంటే దోపిడీ అని జగన్ అనుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందుకే ప్రజల ఆస్తులను దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని, వాలంటీర్ల జీతం రూ.5వేల నుంచి 10వేలకు పెంచుతామని, రాజీనామా చేయొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వాలంటీర్లను చెడగొట్టాలని జగన్ చూస్తున్నారని, అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధ పెడతామని హామీ ఇచ్చారు. దొంగలు సృష్టించే నకిలీ వార్తలు నమ్మవద్దని, కూటమి తరఫున నిర్దిష్ట అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు.
రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరం :యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల పాలు చేశారని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరమని, కేంద్ర మద్దతుతో శిథిల రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతామని అన్నారు. రైతును రాజుగా చేసే బాధ్యత తనదని, రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని పౌరసరఫరాలశాఖ మంత్రి తణుకులో ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.