ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

విశాఖ స్టీల్​ను ప్రైవేటీకరణ చేయం - 3 నెలల్లో సమస్యలన్నీ కొలిక్కి: కేంద్రమంత్రి కుమారస్వామి - CENTRAL MINISTERS IN VISAKHAPATNAM

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రతినిధులతో కేంద్రమంత్రి కుమారస్వామి సమావేశం - స్టీల్‌ప్లాంట్ ప్రత్యేక ప్యాకేజీ వినియోగంపై చర్చించిన కేంద్రమంత్రి కుమారస్వామి

central ministers in visakhapatnam
central ministers in visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 5:25 PM IST

Central Ministers in Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్‌ను పునరుద్ధరిస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రతినిధులతో కేంద్రమంత్రి కుమారస్వామి సమావేశం అయ్యారు. అధికారులు, కార్మిక ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమైన కుమారస్వామి, స్టీల్‌ప్లాంట్ ప్రత్యేక ప్యాకేజీ వినియోగంపై చర్చించారు. అనంతరం ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీలు భరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.

జూన్‌లో మూడో ఫర్నేస్‌ను కూడా ప్రారంభిస్తాం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. కార్మికుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించమని, సమస్యలను 3 నెలల్లో కొలిక్కి తెస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, జూన్‌లో మూడో ఫర్నేస్‌ను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ దుస్థితి గురించి ఏపీ ఎంపీలు వివరించారని అన్నారు. కేంద్రమంత్రి అయ్యాక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఎన్నో సమీక్షలు చేశానని తెలిపారు.

2030లోపు దేశవ్యాప్తంగా 300 మిలియన్‌ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్నామన్న కుమారస్వామి, విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకు సుమారు 30 మంది మరణించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభంలో ఉత్పత్తి బాగా ఉండేదని పేర్కొన్నారు. 2013-14 వరకు విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరు బాగా ఉందని, 2013లో నవరత్న హోదా సాధించిందని తెలిపారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.35 వేల కోట్ల అప్పు ఉంది: 2014-15లో విశాఖ ఉక్కు పరిశ్రమలో స్టీల్‌ ఉత్పత్తి పెంచాలని నిర్ణయించామని, ఉత్పత్తి పెంచాలని నిర్ణయించిన నాటి నుంచి నష్టాల్లోకి వెళ్లిందని అన్నారు. 2021లో విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రతిపాదించారని కుమారస్వామి తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్‌ను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.35 వేల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే స్టీల్‌ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు వివరించారు.

లాభాల బాటలోకి తీసుకెళ్లాలనే ప్రత్యేక ప్యాకేజీ:దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకెళ్లాలనేది మోదీ లక్ష్యమని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్లాలనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, కుమారస్వామి కృషి వల్లే స్టీల్‌ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు భరోసా కల్పించాలనే కుమారస్వామి వచ్చినట్లు తెలిపారు.

సెయిల్ వద్దంటోంది - కారణం అదే! విశాఖ స్టీల్​పై కేంద్రమంత్రి క్లారిటీ

'ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మాటే ఉండదు' - ఆర్థిక సాయంపై కూటమి నేతల హర్షం

ABOUT THE AUTHOR

...view details