ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

శ్మశానాలు, బురద గుంతల్లో పెళ్లికూతుళ్లు! - ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరుతో వింత పోకడలు! - CRAZY PREWEDDING SHOOTS

ఆధునికత పేరుతో దారి తప్పుతున్న ఆచారాలు - పెళ్లి ఖర్చుల్లో భారీగా పెరుగుదల

Prewedding Shoots are Getting Weirdly Crazy
Prewedding Shoots are Getting Weirdly Crazy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2025, 2:31 PM IST

Prewedding Shoots are Getting Weirdly Crazy :నేటి కాలంలో పెళ్లి ఖర్చు ఓ వైపు ఆకాశాన్ని అంటితే కల్యాణం పేరుతో కొన్ని పెడపోకడలు కూడా ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, ఫొటో షూట్‌ పేరుతో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. కొన్ని సార్లు ఇది హద్దులు దాటుతోంది. అన్ని మతాల్లోనూ అత్యంత పవిత్రమైన ఘట్టమైన పెళ్లి వేడుక అసహ్యంగా కూడా మారుతోంది. కొంతమంది ఆసుపత్రులు, శ్మశానాలు, బురదలో షూట్‌ చేయించుకుంటున్నారు. నదులు, సముద్రాలు, కొండలు వంటి ప్రదేశాల్లో షూట్‌ చేయించుకుంటూ మరికొందరు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలూ ఉన్నాయి.

Prewedding Shoots are Getting Weirdly Crazy (ETV Bharat)

పల్లెలకూ పాకింది!

పెళ్లంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమం. ఈ జ్ఞాపకాన్ని కలకాలం దాచుకోవాలని ఒకప్పుడు ఫోటోలు, వీడియోలు తీయించుకునే వారు. అయితే ఇప్పుడు ఆ పరిధి దాటి ఫోటో షూట్‌, ప్రీవెడ్డింగ్‌లు వచ్చేశాయి. పెళ్లి చేసుకోబోయే జంట కొన్ని రోజుల ముందే ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్లి ఫోటో షూట్ జరిపించుకుంటున్నారు. ఆ వీడియోను పెళ్లిరోజు పెద్ద వీడియో తెరలపై ప్రదర్శిస్తున్నారు. మొదట్లో పట్టణాలలో ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ పాకింది. ఇటీవలి కాలం వరకు పెళ్లి రోజు ఫ్లెక్సీ పెట్టించడానికి రెండు, మూడు రోజుల ముందు వధూవరులు ఫొటో దిగేవారు. ఇదే ఆధునీకరణ చెందుతూ ప్రీవెడ్డింగ్ షూట్‌గా మారింది. ఫొటోలకే పరిమితం కాకుండా సినిమా పాటలకు డాన్స్ చేస్తూ రకరకాల లొకేషన్లలో వీడియో షూట్ చేయించుకుంటున్నారు.

Prewedding Shoots are Getting Weirdly Crazy (ETV Bharat)

ప్రమాదకర ప్రదేశాల్లోనూ!

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ద్వారా పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావించడంలో తప్పు లేకున్నా ఇటీవల కాలంలో అది కట్టుతప్పడమే ఆందోళన కల్గిస్తోంది. ఇవి ఒక్కోసారి శృతి మించుతున్నాయి. ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే తాపత్రయంతో కొందరు ఆసుపత్రులు, శ్మశానాలు, బురదలో సైతం షూట్ చేయించుకుంటున్నారు. శ్మశానం అంటే కీడుగా భావిస్తుంటారు. అయితే పవిత్రమైన పెళ్లికి సంబంధించిన ఘట్టాన్ని అక్కడ జరిపించుకుంటూ దీన్ని అపవిత్రంగా మారుస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ పోలీసు తన భార్యతో కలిసి స్టేషన్‌లో పోలీస్ వాహనం ముందు ఈ తరహా షూట్ చేయడం సంచలనమైంది. ఇద్దరూ పోలీసులే కావడం, శుభ కార్యం కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కర్ణాటకలో ఓ వైద్యుడు ప్రభుత్వ ఆపరేషన్ థియేటర్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించారు. ప్రమాదకర ప్రదేశాల్లో ఫొటో షూట్‌ జరిపించుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ఓ జంట నదిలో ఫొటో షూట్ చేయటానికి వెళ్లి అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో కొట్టుకుపోయారు.

Prewedding Shoots are Getting Weirdly Crazy (ETV Bharat)

మీడియాలో వైరల్‌ :

పెళ్లి కూతురుగా ముస్తాబైన తర్వాత అలంకరణ చెదిరిపోతుందని, లేక ఇంకా వేర్వేరు కారణాలతో పెళ్లికూతురును పెద్దవారు ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదు. కానీ ఇటీవల యువతులు పెళ్లికూతురు ముస్తాబులో ఏకంగా బుల్లెట్‌ బైక్‌ నడుపుతూ చక్కర్లు కొడుతూ ఆ వీడియోలను మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ప్రీవెడ్డింగ్‌, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్‌, బేబీ బంప్‌ వీడియోలు షూట్‌ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. మితీమీరనంత వరకు ఏదైనా మంచిదే అంటున్నారు- నిపుణులు. ప్రీవెడ్డింగ్‌ అనేది వేలం వెర్రిగా మారుతోందంటున్నారు.

ఆధ్యాత్మిక వేత్తలు మాత్రం పెళ్లి ఆడంబరాల కోసం చేస్తున్న ఖర్చులను వృథాగా అభివర్ణిస్తున్నారు. ‍‌ఆ క్షణం చేసిన ఏర్పాట్లు, పెట్టిన ఖర్చు ఎందుకు పనిరాదని హితవు పలుకుతున్నారు. ప్రీవెడ్డింగ్‌ షూట్‌లు, ప్రత్యేకమైన థీమ్స్‌లో జరుగుతున్న తతంగం కొన్నిచోట్ల అనుకోని ఇబ్బందులకు కారణమవుతోందని వారిస్తున్నారు. ప్రీవెడ్డింగ్‌ షూట్‌ తర్వాత అనుకోని పరిస్థితిలో వివాహం ఆగిపోతే అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈలోగా ప్రీవెడ్డింగ్‌ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోకి వస్తే ఆ తర్వాత అమ్మాయి పెళ్లి ఇబ్బంది అవుతుందనే వాదన ఉంది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ల కోసం చేస్తున్న ఆడంబర ఖర్చులన్నీ వృథా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటి కోసం ఆర్థిక సాయం చేసేందుకు ఫైనాన్స్‌ కంపెనీలు పుట్టుకొచ్చి అదో పరిశ్రమగా మారుతోంది. వీడియో ఫోటోలకు పది నుంచి 15 లక్షల రూపాయల వరకు ఛార్జ్‌ చేస్తున్నారని అంటున్నారు.

భారీ బడ్జెట్‌ సినిమాలా ?

పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో మధురక్షణం. రెండు జీవితాలను, కుటుంబాలను ఏకం చేసే పవిత్ర ఘట్టం. ప్రస్తుతం ఒకింటికి ఆడపిల్లను ఇవ్వాలన్నా. తెచ్చుకోవాలన్నా పెళ్లి ఖర్చులు భయపెడుతున్నాయి. ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. బంధువర‌్గంలో పలుచన అవుతామనో అతిధులు తమ ఆర్ధిక స్థితిని తక్కువగా అంచనా వేస్తారనో అపోహలతో చాలా మంది ఆర్భాటలకు పోతున్నారు. దీనికితోడు సోషల్‌ మీడియా కారణంగా కొత్త సంప్రదాయాలు, ఆడంబరాలు వచ్చిపడుతున్నాయి. వాటికి ప్రభావితమైన వధూవరులు, వారి తల్లిదండ్రులు పెళ్లి ఖర్చును భారీ బడ్జెట్‌ సినిమాలా పెంచేస్తున్నారు.

సగటున 10 లక్షలకుపైగా!

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు నుంచి మళ్లీ పెళ్లిళ్ల సందడి ప్రారంభం కానుంది. మే నెల వరకు మూహూర్తాలు ఉన్నాయి. మాఘమాసంలో పెళ్లి చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు ఇప్పటికే హడావుడిలో ఉన్నారు. ఫంక్షన్‌ హాళ్లకు డిమాండ్‌ పెరిగింది. ఫంక్షన్‌ హాళ్లలో వేదిక, ఇతర అలంకరణకు స్థాయిని బట్టి రెండు లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఫోటోలు, వీడియోల వంటి వాటికి కూడా భారీగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. పేద కుటుంబాలు సైతం అప్పులు తెచ్చి ఒక పెళ్లికి సగటున 10 లక్షలకుపైగా ఖర్చు పెడుతున్నాయి.

మన దగ్గరే ఖర్చు ఎక్కువ!

చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా పెళ్లి ఖర్చులు పెడుతున్న దేశం మనదే. భారత్‌లో వివాహాలపై ఏటా 10.70 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. దేశంలో ఆహారం, గృహోపకరణాల తర్వాత ప్రజలు అత్యధికంగా ఖర్చు పెడుతోంది వివాహాలకే అని వివిధ అధ్యయనాల్లో తేలింది. పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిధులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించడంలో భారతీయ కుటుంబాలు ముందున్నాయి. అమెరికాలో పెళ్లికి పిలిచే అతిధుల సంఖ్య సగటున 115. బ్రిటన్‌లో 80. మన దేశంలో 326 దాకా ఉన్నట్లు వెడ్డింగ్‌ వైర్‌ సంస్థ 2023లో నిర్వహించిన సర్వేలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కనీసం 500 మందిని పిలవకుండా పెళ్లి చేయడం చాలా అరుదు. ఈ క్రమంలోనే ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. అందువల్ల పేద, మధ్యతరగతి ప్రజలు హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా, అప్పుల పాలు కాకుండా పెళ్లిళ్లు చేస్తేనే మేలనే వాదనా లేకపోలేదు.

తిరుమలలోని ఈ పెయింటింగ్ ఏమిటో తెలుసా? - 90శాతం మంది భక్తులు ఫెయిల్!

వెన్నెల రాత్రుల్లో అలలపై తేలియాడుతూ బోటు షికారు- ఏపీ టూరిజం సరికొత్త ప్యాకేజీలు!

ABOUT THE AUTHOR

...view details