Vankaya Ulli Karam in Telugu : తెలుగు ప్రజలకు వంకాయ కర్రీ అంటే ఎంతో ఇష్టం. మరీ ముఖ్యంగా ఆంధ్రులకు గోంగూర, వంకాయ అంటే ప్రాణం. ఇంట్లో ఈ ఒక్క కూర ఉంటే చాలు కడుపు నిండా తృప్తిగా భోజనం చేయచ్చని ఎక్కువ మంది చెబుతుంటారు. అయితే, వంకాయ కర్రీని టమాటా వేసి వండుకోవడం చాలా కామన్. అలా కాకుండా ఓసారి గుంటూర్ స్టైల్లో వంకాయ ఉల్లికారం ట్రై చేయండి. ఈ వంకాయ ఉల్లికారం వేడివేడి అన్నంతో రుచి అద్దిరిపోతుంది. పైగా ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వారు కూడా దీనిని ఈజీగా చేసేయచ్చు. మరి వంకాయ ఉల్లికారం చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు! - సింపుల్ ట్రిక్
కావాల్సిన పదార్థాలు :
- పొడవు వంకాయలు - పావుకేజీ
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఉల్లిపాయలు - 4
- కారం - రుచికి సరిపడా
- జీలకర్ర - టీస్పూన్
- పసుపు - అరటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 4
- నూనె
తయారీ విధానం :
- ముందుగా పొడవు వంకాయలను శుభ్రంగా కడగాలి. ఆపై చాకుతో మధ్యలోకి ఒకసారి గాట్లు పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్ని వంకాయలను మధ్యలోకి కట్ చేసుకోండి.
- అలాగే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకోండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కారం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి నీళ్లు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ ఉల్లికారం మిశ్రమాన్ని కట్ చేసిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి సరిపడా నూనె వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో ఉల్లికారం స్టఫ్ చేసిన వంకాయలను వేసి మూత పెట్టండి.
- ఒక 5 నిమిషాల తర్వాత గరిటెతో మెల్లిగా కలుపుతూ వేపుకోండి. ఇందులోనే మిగిలిన ఉల్లికారం మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకోండి.
- స్టవ్ మీడియంలో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి వంకాయలు మెత్తగా ఉడికించుకోండి. వంకాయలు మాడిపోకుండా ఉండడానికి మధ్యమధ్యలో కలుపుతూ వేపుకోండి.
- వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత కూరలో నూనె పైకి తేలుతుంది. ఈ స్టేజ్‌లో ఉప్పు రుచి చూసుకోండి.
- ఉల్లికారం గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారిన తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే నోరూరించే వంకాయ ఉల్లికారం రెడీ!
- వంకాయ ఉల్లికారం ఒక్కటి ఉంటే చాలు అన్నం తృప్తిగా తినొచ్చు!
- ఈ వంకాయ ఉల్లికారం నచ్చితే మీరు కూడా ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.
కరకరలాడే "పెరుమాళ్ వడలు" - అచ్చం తిరుపతి "వడ ప్రసాదం" రుచి!
పిండిలో ఈ ఒక్కటి వేస్తే చాలు - చపాతీలు ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయి!