Disadvantages of aluminum cookware :వంట పదార్థాలే కాదు అందుకు ఉపయోగించే పాత్రల ఎంపిక కూడా కీలకం అంటున్నారు నిపుణులు. అల్యూమినియం పాత్రల వాడకంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. డెన్మార్క్ దేశంలో దాదాపు 200 ఏళ్ల కిందట ఆవిష్కరించిన ఈ అల్యూమినియం(సత్తు)ను పలు దేశాల్లోకి విస్తృతంగా ఎగుమతి అయ్యింది. దీని రాకతో అప్పటి వరకు ఉన్నటువంటి మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలు కనుమరుగైపోయాయి.
పిల్లల షూ ఎలా క్లీన్ చేయాలి? - వాషింగ్ మిషన్లో వేయొచ్చా!
అల్యూమినియం లోహాన్ని 1825లో మొట్టమొదటి సారిగా డెన్మార్క్ శాస్త్రవేత్త కనుగొన్నారు. భారత్‌లో 1938లో 'ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్' అనే సంస్థ ఉత్పత్తిని ప్రారంభించడంతో వాడకం విస్తృతమైంది. తక్కువ ధరకే లభిస్తుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో పాత్రల వాడకం అనతి కాలంలోనే పెరిగిపోయింది. ఈ పాత్రల్లో చేసిన వంటకాల్లో అతిసూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం కరిగి ఉంటుందని, ఆహారం ద్వారా శరీరాల్లోకి ప్రవేశిస్తుందని పలు పరిశోధనలు తేల్చాయి. అల్యూమినియం పాత్రల వాడకంతో ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని వైద్యులు సైతం వెల్లడించారు.
ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం. ఇందులో అల్యూమినియం పాత్ర ఏమీ లేదు. ఈ నేపథ్యంలో అల్యూమినియం లోహం అధికభాగం మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళ్లిపోతుంది. కడుపులోకి వెళ్లిన అల్యూమినియంలో 0.01% నుంచి 1% వరకూ జీర్ణకోశం శోషించుకోగా, మూత్ర పిండాల ద్వారా వెళ్లగొడతాయి. కణజాలాల్లో పేరుకునే స్వభావం కారణంగా ఎముకలు, మెదడు వంటి శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదముందని, దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత హాని చేస్తుందని వైద్యులు వెల్లడించారు.
రక్తహీనత సమస్య
టమాటా, చింతపండు మన వంటల్లో నిత్యం వాడుకునేవే. కానీ, వీటితో పాటు నిమ్మ వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుందట. మానవ శరీర నిర్మాణ ప్రక్రియలో ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు అవసరం కాగా, రోజురోజుకూ శరీరంలో పేరుకుపోతున్న అల్యూమినియం మన దేహానికి ఉపయోగ పడకపోగా అడ్డంకిగా మారుతుంది. దీంతో రక్తహీనత సమస్యతో పాటు ఎముక మెత్తబడటం (ఆస్టియోమలేషియా), డయాలిసిస్ ఎన్‌కెఫలోపతి (ఇది దీర్ఘకాలంగా డయాలిసిస్ చేయించుకునేవారిలో వచ్చే సమస్య) అనే నాడీ మండల వ్యాధికి కారణమవుతుందని వైద్యులు గుర్తించారు.
వ్యాధులకు మూలం
మెదడులో అల్యూమినియం లోహం మోతాదుకు మించి పేరుకుపోతే 'డయాలిసిస్ ఎన్‌కెఫలోపతి' లేదా '‘డయాలసిస్ డిమెన్షియా' వ్యాధికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. ఈ స్థితికి చేరిన వ్యక్తుల్లో మాట సరిగ్గా రాకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, శరీర కదలికల్లో మార్పు, ప్రవర్తనలో తేడా వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అంతేకాదు అల్జీమర్స్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా ఇది మూలమని తెలుస్తోంది. సహజంగా ఒక మనిషి వారానికి తమ బరువులో ప్రతి కిలోకు 2 మిల్లీ గ్రాముల వరకు అల్యూమినియం తీసుకున్నా శరీరం తట్టుకోగలదని యూఎన్ఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), డబ్ల్యూహెచ్ఓ ప్రకటించాయి. అంతకు మించి శరీరంలో నిల్వ ఉంటే అనారోగ్యాలు తప్పవంటున్నారు.