Consumption of Nonveg :మాంసాహారం తెలుగు ప్రజల ఇష్టమైన ఆహారం. ఇటీవల నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వేలో మాంసాహారం అధికంగా తీసుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ (98.25శాతం), తెలంగాణ (97.40శాతం) నాలుగు, ఐడో స్థానాల్లో నిలిచాయి. చాలా మంది బలవర్ధకాహారం కోసం, శరీర సౌష్టవం పెంచుకోవడానికి మాంసాహారానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంకొంత మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే, నాన్ వెజ్ ఎవరెవరు ఎంత తినాలి? రోజూ తినొచ్చా? వారంలో ఎన్నిసార్లు తినాలి అనే సందేహాలు చాలామందికి ఉన్నవే. అలాంటి వారి కోసం ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
మాంసాహారం అంటే మటన్, చికెన్, చేపలు, రొయ్యలు మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది బీఫ్, ఫోర్క్, అటవీ మాంసం కూడా తింటుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పోషకాహార నిపుణులు, డాక్టర్ స్వరూపా రాణి మాట్లల్లో తెలుసుకుందాం.
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
'మాంసాహారం మంచిదా? చెడ్డదా? అంటే మంచిదే. శరీరానికి అవసరమైన ప్రొటీన్ (మాంసకృత్తులు), శరీరాభివృద్ధికి ప్రొటీన్ వెజిటెబుల్స్, నాన్‌వెజ్ నుంచి అందుతుంది. వెజిటెబుల్స్ నుంచి వచ్చేది కంప్లీట్ ప్రొటీన్ కాదు. అమైనో యాసిడ్స్ వాల్యూస్ ఎక్కువగా ఉంటే హై బయాలాజికల్ ప్రొటీన్, తక్కువగా ఉంటే లో బయలాజికల్ ప్రొటీన్ అంటారు. మాంసం నుంచి వచ్చేది హై బయాలాజికల్ ప్రొటీన్, వెజిటెబుల్స్ నుంచి వచ్చేది లో బయలాజికల్ వాల్యూ ఉంటుంది. మాంసాహారం రోజూ తిన్నా మంచిదే. కానీ, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నారన్నదే ముఖ్యం. రోజూ 100 నుంచి 150గ్రాముల వరకు సరిపోతుంది. అంతేగానీ కిలోల కొద్దీ తీసుకుంటే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. రాళ్లు ఏర్పడతాయి. మాంసాహారంలో చేపలు అన్నింట్లో మంచి ఫుడ్. ఆర్టిఫిషియల్ గా పెంచే చేపలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. సహజసిద్ధంగా చెరువులు, నదుల్లో దొరికే చేపలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది' అని పోషకాహార నిపుణులు, డాక్టర్ స్వరూపా రాణి వెల్లడించారు.