అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రామాయణం గాథని తెరకెక్కిస్తే చూడాలనేది సినీ ప్రేమికుల కోరిక. సామాజిక మాధ్యమాల ద్వారా ఆ కోరిక బలంగా వెలిబుచ్చుతున్నారు. రాజమౌళి మేక్ రామాయణ్... అనే హ్యాష్‌ట్యాగ్ ఇటీవల ట్విట్టర్‌లో ట్రెండింగ్ కూడా అయ్యింది. మరి రాజమౌళి రామాయణం చేస్తారో లేదో తెలియదు, కానీ... మహాభారతం మాత్రం తన కలల సినిమా అని తరచూ చెబుతుంటారు. ఈ విరామంలో ఆ సినిమాకి సంబంధించిన పనులేమైనా మొదలుపెట్టారా? అని 'ఈనాడు సినిమా' ఇటీవల ఎస్.ఎస్.రాజమౌళిని అడిగింది.
ఈ ప్రశ్నకి ఆయన బదులిస్తూ... "మహాభారతం పనులు మొదలుపెట్టాలి. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ఇప్పటికిప్పుడు దానిమీద కూర్చుని పని చేద్దామనే ప్రాజెక్ట్ కాదది. చాలా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడు కానీ దాన్ని మొదలుపెట్టలేం" అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.