పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్‌సాబ్'తో త్వరలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో పాటే వరుసగా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు నిర్మాతగానూ మరింత దూకుడు చూపించేందుకు సిద్ధమయ్యారు.
కొంతకాలం క్రితం 'పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్లో 'సర్దార్ గబ్బర్ సింగ్', 'ఛల్ మోహనరంగ' చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాలేమి చేయలేదు. ఇప్పుడు మళ్లీ చిత్రాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు పవన్. దీని కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయనున్నారు.
ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దాదాపు 15 సినిమాలను నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందులో ఆరు పరిమిత చిన్న తరహా, ఆరు మధ్య తరహా, మూడు భారీ చిత్రాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. రచన, దర్శకత్వంపై ఆసక్తి ఉన్న యువతని వీటిలో భాగస్వామిని చేయబోతున్నట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆలోచల్ని, విభిన్న కథల్ని బహుభాషల్లో తెరకెక్కించగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. దీనికి హరీశ్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యత వహిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
ప్రస్తుతం పవన్ 'వకీల్‌సాబ్'తో పాటు 'అయ్యప్పన్ కోషియమ్' తెలుగు రీమేక్, క్రిష్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: