దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదవుతున్న నేపథ్యంలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) నిర్ణయించింది. పదేపదే హెచ్చరించినా మాస్క్‌ను సరిగా ధరించని విమాన ప్రయాణికులను కిందకు దించివేయాలని డీజీసీఏ అన్ని విమానయాన సంస్ధలను ఆదేశించింది. కరోనా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించే ప్రయాణికుల పట్ల కఠినంగా వ్యవహరించాలని శనివారం విడుదల చేసిన ఆదేశాల్లో సూచించింది. విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని విమానాశ్రయ నిర్వాహకులకు స్పష్టం చేసింది.
విమానాశ్రయంలోకి ప్రవేశించడం మొదలు, విమానం దిగి వెళ్లిపోయే వరకు కొందరు ప్రయాణికులు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడాన్ని తాము గమనించినట్లు డీజీసీఏ తెలిపింది. మాస్కు లేని ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతించరాదని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) పోలీసులను ఆదేశించింది. అత్యవసర పరిస్ధితుల్లో తప్ప ప్రయాణికులు మాస్కును ముక్కు కిందకు దించరాదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఆ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ!