ఒడిశా నుంచి విజయవాడకు చేరుకున్న ప్రత్యేక రైలు.. స్వస్థలాలకు ప్రయాణికులు - Accident news
🎬 Watch Now: Feature Video
Odisha Coromandel train accident: ఒడిశాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం నుంచి ఏలూరుకి చెందిన శ్రీకర్ బాబు అనే యువకుడు సురక్షితంగా బయటపడి తన ఇంటికి చేరుకున్నాడు. శ్రీకర్ బాబు కోల్కతాలో బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చదువుతున్నాడు.. సెమిస్టర్ హాలిడేస్ కోసం ఇంటికి వచ్చేందుకు షాలిమార్ స్టేషన్లో కోరమాండల్ రైలు ఎక్కాడు. ప్రయాణం సాఫీగా జరుగుతుంది అనుకుంటుండగా 40 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం.. రైలు ఘోర ప్రమాదానికి గురయ్యింది.. ఆ ప్రమాదం నుంచి బయటపడిన శ్రీకర్ బాబు అక్కడి నుంచి స్థానికులు, రైల్వే సిబ్బంది సాయంతో రోడ్డు మార్గం ద్వారా భువనేశ్వర్ చేరుకున్నట్లు తెలిపాడు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియకపోయినా.. తాము ప్రయాణిస్తున్న బోగి పెద్ద పెద్ద కుదుపులకు గురవడంతో.. తాము ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైనట్లు తెలిసిందని తెలిపాడు. దాదాపు మూడు గంటల పాటు.. సహాయక చర్యలు కొనసాగాయని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సురక్షితంగా గమ్యానికి చేరుకున్నట్లు శ్రీకర్ వెల్లడించారు.
ప్రత్యేక రైలు ద్వారా.. ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన రాష్ట్ర ప్రయాణికులను ప్రత్యేక రైలు ద్వారా విజయవాడకు చేర్చారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపించారు. ఈ రైలులో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన ఏడుగురు ప్రయాణికులున్నారు. ప్రయాణికులతో కలెక్టర్ దిల్లీరావు మాట్లాడి.. వారిని స్వస్థలాలకు పంపించారు.