Lokesh With Minorities: వైసీపీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయి: లోకేశ్ - నంద్యాల
🎬 Watch Now: Feature Video

తెలుగుదేశం అధికారంలోకి రాగానే కడపలో హజ్ హౌస్‌ను అందుబాటులోకి తెస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళంలో భాగంగా కర్నూలులో ముస్లింలతో నారా లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముస్లింలు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. మైనార్టీలపై దాడులు పెరిగాయని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ నేతలు వక్ఫ్ భూములు ఆక్రమించుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని.. లోకేశ్ నిలదీశారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం అత్త మామున్నీ.. లోకేశ్‌ను కలిశారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని వైసీపీ నేతలు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని, ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కడప జిల్లా ఎర్రబల్లిలో తనకున్న ఎకరం భూమిని సీఎం జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి ఆక్రమించుకున్నాడని... ఆళ్లగడ్డకు చెందిన అక్బర్ బాషా, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. భార్యా, పిల్లలతో కలిసి తిరుపాల్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటే భూమి తిరిగి ఇస్తామని చెబుతున్నారని... కోర్టు ఆ భూమి మాది అని చెప్పినా తిరిగి ఇవ్వలేదని, అక్బర్ బాషా కన్నీరు పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం పోతుందని, త్వరలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని ముస్లింలకు లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.