protest at CRDA office: ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణాలను వ్యతిరేకిసూ.. సీఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసన
🎬 Watch Now: Feature Video
Kolikapudi Srinivasa Rao protest: రాజధాని ప్రాంతంలోని ఆర్ 5 జోన్లో ఇళ్లస్థలాలు, ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వటంపై రాజధాని ప్రాంతానికి చెందిన దళిత నేత కొలికపూడి శ్రీనివాసరావు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యాలయంలోని బుద్ధ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కార్యాలయం వెలుపల ఉన్న వాచ్మెన్లు, సీఆర్డీఏ కార్యాలయంలోనికి వెళ్లే అధికారుల బూట్లు తుడిచి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోని బుద్ధుని విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయకుండా యుద్ధ ప్రాతిపదికన అనుమతి లేని ఆర్ 5 జోన్లో ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మించడం ఏమిటని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించిన ప్రాంతంలో సుమారు 52వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న పేదలకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ఆ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజకీయ లక్ష్యంతో రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు కూడా చెల్లించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. రాజధాని రైతులకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంత పేదలకు భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాజధానియేతర ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని ఆరోపించారు. అనంతరం సీఆర్డీఏ కమిషనర్‌కు విజ్ఞాపన పత్రం అందించారు. తక్షణం వీటిని నిలుపుదల చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.