Houses Eviction: 'వైసీపీకి ఓటేసిన నేరానికి.. మా ఇళ్లే కుల్చారు' - ఏపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వడ్డీ పాలెంలో ఇళ్ల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి నోటీసులు లేకుండా ఉన్న ఫళంగా నగరపాలక సంస్థ అధికారులు వచ్చి బలవంతంగా ఇళ్లు కొట్టేశారని బాధితులు వాపోయారు. గతంలో రహదారి విస్తరణకు 30 అడుగులు సరిపోతాయన్న అధికారులు 50 అడుగులు కావాలని... తమ ఇళ్లు కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వర్షాలు పడుతున్న సమయంలో ఇళ్లను కొట్టేస్తే ఎక్కడికి వెళ్లి ఉండాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేకు తమ బాధను చెబితే.. ఎక్కడైనా అద్దెకు వెళ్లండని సమాధానం ఇస్తున్నారని బాధితులు చెబుతున్నారు. గత 50ఏళ్లుగా ఉంటున్న తమను ఉన్న ఫళంగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు ఎక్కడైనా ప్రభుత్వం స్థలం ఇస్తే వెళ్లి పోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఓటేసిన నేరానికి తమ ఇళ్లే కూల్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్ల స్థలంపై ప్రభుత్వం, అధికారులు ఎలాంటి హామీ ఇవ్వకుండా వెళ్లిపోమంటే ఇక్కడ్నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.