రేపటి నుంచి 24 గంటల రిలే నిరాహార దీక్షలు: అంగన్‌వాడీలు - Anganwadis Strikes news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 7:42 PM IST
Anganwadis Relay Hunger Strike Start From January 5th: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 రోజులుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ, గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ అంగన్‌వాడీలు, హెల్పర్లు వివిధ రకాలుగా ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5వ తేదీన (రేపు) విజయవాడ ధర్నాచౌక్ వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నామని సీఐటీయూ (CITU), ఏఐటీయూసీ (AITUC), ఐఎఫ్‌టీయూ (IFTU) సంఘాల నాయకులు తెలిపారు.
Anganwadis Leaders Comments: ''ఈనెల 5వ తేదీ నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో 24 గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించబోతున్నాం. 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తాం. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇస్తామని ఆనాడు జగన్ హామీ ఇచ్చి, దారుణంగా మోసం చేశారు. అంగన్‌వాడీల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహిస్తే, పోలీసుల సహాయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అణచివేసేందుకు కుట్ర చేసింది. ఆ ఆందోళనల్లో వివిధ జిల్లాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. మా సమస్యలను పరిష్కరించలేని ఈ చేతకాని ప్రభుత్వం, పోలీసులను ఉపయోగించి మా ఉద్యమాన్ని నీరుగార్చడానికి చూస్తోంది. మా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మెను విరమించబోం. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలి. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాలి'' అని మూడు సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.