YSR District Farmers Problems : సాధారణంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు అన్ని రకాల ప్రాధాన్యతలుండటం సహజం. ఇక్కడ మాత్రం కరవు తీవ్రతను తెలిపేలా అన్ని రకాల కొలమానాలు కనిపిస్తున్నా... వైసీపీ ప్రభుత్వం కరవు మండలాలు ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కరవు పరిస్థితులపై సమీక్షిస్తుంది. కనీసం జిల్లా స్థాయిలో ఆ మేరకు ఇన్‌ఛార్జి మంత్రి, ప్రజాప్రతినిధులు సమీక్షించి గోడు వినడం లేదు. పంట ఎండిపోతే చేసిన అప్పులు తీర్చేదెలా అనే ఆవేదనతో రైతు కుటుంబాలు కుంగిపోతున్నాయి. ఏ ఊరు చూసినా... ఏ పంట చేనులోకి వెళ్లినా... పశువుల కొట్టానికి వెళ్లినా దీన పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి.
కష్టాల్లో కూరుకుపోతున్న కౌలు రైతు
AP Farmers Irrigation Problems 2023 : వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాల్లో కరవుతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. పెద్దముడియం మండలంలో కంది, పత్తి, జొన్న, వరి, మినుము పంటలు సుమారు 5300 ఎకరాల్లో సాగు చేశారు. సుమారు నెలరోజులుగా వర్షాలు కురవకపోవడం, ఎండల తీవ్రతతో పంటలు ఎండిపోతున్నాయి. పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో మినుము, కంది, జొన్న పంటలు వాడిపోతున్నాయి. వాన కురుస్తుందన్న ఆశతో శనగ పంట సాగు చేస్తే.... మొలక దశలోనే ఎండుముఖం పట్టింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి పంట ఎండిపోతోంది. రబీలో శనగ సాగుకు సిద్ధంగా ఉన్నా జాడలేని వర్షం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లో గతేడాది 35 వేల ఎకరాల్లో శనగ సాగుచేశారు. ఈసారి అదును దాటిపోతున్నప్పటికీ చినుకు పడక ఒక్క ఎకరా కూడా సాగుకు నోచుకోలేదు. కాలువలు, కుంటల వద్ద ఆయిల్ ఇంజిన్లు అమర్చి పైపుల ద్వారా నీరు పారించే ప్రయత్నం చేస్తున్నారు.
పంట నష్టం ప్రాంతాల్లో అధికారుల పర్యటన
'వరి పంటలతో కళకళలాడాల్సిన కేసీ కాలువ ఆయకట్టు ప్రాంతంలో బీడు భూములు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా జొన్న, మినుము పంటలు సాగు చేయగా... అవి కూడా ఎండిపోతున్నాయి. విత్తు విత్తిన రైతులు నీరందించేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. వానల్లేకపోవడంతో కాలువ నీటిపై ఆశలు పెంచుకున్నాం. కుందూ నదిలో ప్రవహిస్తున్న నీటిని రాజోలి ఆనకట్ట నుంచి గత నెల 10న కేసీ ప్రధాన కాలువకు మళ్లించారు. ప్రధాన కాలువ పరిధిలోని 55 వేల ఎకరాలకు 40 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. కాలువకు 15 రోజుల పాటు సక్రమంగా వచ్చినా, ఆ తరువాత కుందూ నదిలో నీటిమట్టం పడిపోవడంతో ప్రభావం కేసీ కాలువపై పడింది. కాలువలో జాలువారుతూ నీరు కనిపించడంతో ఆందోళన మొదలైంది. కాలువలో అక్కడక్కడా అడ్డుకట్టలు వేసి నీటిని మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నాం. పంటను దక్కించుకునేందుకు మరికొందరు కాలువలో నీటిని మోటార్లతో తోడుకుంటున్నారు. ఆయిల్ ఇంజిన్, ఇంధనం బాడుగ పైపులతో ఖర్చు తడిసి మోపెడవుతోంది.' - బాధిత రైతులు
Farmers Fires on CM Jagan : సీకే దిన్నె మండలం గొల్లపల్లె వద్ద బోరుబావుల్లో సైతం నీరు లేక చామంతి తోటలు ఎండిపోయాయి. కాశినాయన మండలం కోడిగుడ్లపాడు, చిన్నాయపల్లె, వడ్లమాను గ్రామాల్లో పంటల నష్టం తీవ్రంగా ఉంది. తెలుగుగంగ నీటిని ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే నష్ట తీవ్రత అధికంగా ఉంటుంది. ఉద్యాన పంటలకు సైతం నష్టం జరుగుతోంది. బాలాయపల్లె రైతులు పసుపు సాగు చేపట్టగా... సాగునీరు లేక అల్లాడుతున్నారు.