కడపజిల్లా వ్యాప్తంగా పంచాయతీల నుంచి చెత్తను హరిత రాయబారులు, పారిశుద్ధ్య కార్మికుల ద్వారా సేకరించి వాటిని సంపద కేంద్రాలకు తరలించే విధానాన్ని గతేడాది ప్రారంభించారు. ఇందుకోసం ఆయా మండలాల్లో ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున చెత్త నుంచి సంపద తయారీ చేసే కేంద్రాలను నిర్మించారు. వీటి నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల నుంచి ఒక్కో కేంద్రానికి జనాభా లెక్కల ప్రకారం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా 50 మండలాల్లో 796 పంచాయతీల్లో వీటి నిర్మాణం కోసం దాదాపు 33 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కొన్ని ప్రాంతాల్లో కేంద్రాలను నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభమైనవి సరైన ఫలితాలు ఇవ్వక మూతపడ్డాయి. ఇంకొన్ని మాత్రం పిచ్చి మొక్కలు, కంపచెట్లకు నిలయంగా మారాయి.
వదిలేశారంతే..
ప్రభుత్వం సంపద కేంద్రాలను పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. కొన్నిచోట్ల మద్యం ప్రియులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఈ కేంద్రాలను పంచాయతీ అధికారులు, మండల స్థాయి ఉన్నతాధికారులుగాని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క మండలంలోనే కోటి రూపాయలకు పైగా ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు ప్రస్తుతం నష్టాల చెత్తలో మునిగిపోతున్నాయి.
భవనాల వరకే మా బాధ్యత
చెత్త నుంచి సంపద తీసే కేంద్రాల పనితీరుపై జాతీయ ఉపాధి హామీ పథక పీడీ యదుభూషణ్‌రెడ్డిని వివరణ కోరగా కేవలం భవనాలు కట్టడం వరకే తమ బాధ్యతని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా పంచాయతీ శాఖదేనని పేర్కొన్నారు.
సక్రమంగా పనిచేస్తున్నాయి
చెత్త నుంచి సంపద తీసే కేంద్రాల నిరుపయోగంపై జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా సంపద కేంద్రాలు జిల్లాలో బాగా పనిచేస్తున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఎక్కడా పిచ్చిమొక్కలు, కంపచెట్లుగాని మొలవలేదన్నారు.
వృథాగా వదిలేయడం బాధాకరం
రూ.కోట్లు ఖర్చుపెట్టి చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రాలను నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా నిరుపయోగంగా ఉండటం బాధాకరం. వీటిని వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
- పంజగల వెంకటసుబ్బయ్య, కేతరాజుపల్లె
ఇదీ చూడండి.