మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతంది. తాజాగా...తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వివేకా కుమార్తె సునీత కడప ఎస్పీ అన్బురాజన్‌కు లేఖ రాశారు. తమ కుటుంబానికి వెంటనే భద్రత కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 10న మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ చేశాడని ఆమె లేఖలో వెల్లడించారు. మణికంఠరెడ్డిని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడుగా సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో ప్రధాన అనుమానితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడు రెక్కీ నిర్వహించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా అనుమానితుడిని గుర్తించామని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీని కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు పంపారు.
కొనసాగుతున్న వివేకా హత్య కేసు విచారణ
వివేకా హత్య కేసులో 68 రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పులివెందుల ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉమా శంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇతను ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు కేసులో కీలక అనుమానితులుగా ఉన్నాడు.
పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. కడపలో కూడా మరో నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు.. నిన్న రాత్రి నుంచి విచారణ చేస్తున్నారు. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్‌పై విచారణ కొనసాగుతోంది. అతని బంధువు భరత్ యాదవ్‌ను కూడా నేడు ప్రశ్నిస్తున్నారు. సునీల్‌ను కలిసేందుకు అతని తల్లి సావిత్రి, భార్య లక్ష్మి కడప కేంద్ర కారాగారానికి వచ్చారు. సాయంత్రం కొందరు అనుమానితులను సీబీఐ అధికారులు పులివెందులలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
viveka murder case: వివేకా కేసు.. కడప, పులివెందులలో అనుమానితుల విచారణ